జగన్ గురించి తప్పుగా మాట్లాడా.. రఘురామ కృష్ణంరాజు షాకింగ్ వీడియో రిలీజ్
వివాదాస్పద నేత రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. ఆయన నిత్యం వివాదాలతో సావాసం చేస్తూనే ఉంటారు. 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజు వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. కొన్నిసందర్భాల్లో ఏకంగా సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన.
గత ఎన్నికల్లో కూటమి తరుఫున ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.ఎమ్మెల్యే కావడంతో ఆయన అసెంబ్లీ రావడం జరిగింది. ఇదే సమయంలో జగన్ కూడా అసెంబ్లీలో కనిపించడంతో , వైసీపీ అధినేతతో రఘురామ కృష్ణంరాజు కాసేపు సరాదగా ముచ్చటించారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగినట్టు తెలుస్తోంది. మీరు అసెంబ్లీకి రారు అనుకున్నానని జగన్‌తో రఘురామ కృష్ణంరాజు చెప్పినట్టుగా తెలుస్తోంది. మీరు ప్రతిరోజు అసెంబ్లీకి రావాలి. నేను మీ పక్కనే కూర్చుంటానంటూ వ్యాఖ్యానించారట రఘురామ కృష్ణంరాజు.

దీనికి జగన్ సమాధానం ఇస్తూ.. తప్పకుండా వస్తాను చూస్తారుగా అంటూ జవాబిచ్చారట.కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ తిరిగి యథావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు. ఇదిలా ఉంటే తాజాగా రఘురామ జగన్‌పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ గురించి ఆయన మాట్లాడుతూ.."గతంలో జగన్ మోహన్ రెడ్డి గారిని వాడూ వీడూ అని కొన్ని సార్లు మాట్లాడి ఉండొచ్చు.. అప్పుడు తనను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి.. ఆవేశమో, మరెందుకో కానీ కొన్ని సందర్భాల్లో వాడూ, వీడూ అనడం జరిగింది. ఇప్పటి నుంచి నేను వయసులో నాకంటే చిన్నవాడైనా, స్నేహితుడి కొడుకైనప్పటికీ.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఆయనను నేను గౌరవంగానే సంబోధిస్తాను" అని రఘురామ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి గురించి అవమాన కరంగా మాట్లాడను, మర్యాద ఇచ్చి మాట్లాడతా - టిడిపి ఎమ్మెల్యే రఘురామరాజు#RaghuRamaKrishnaRaju #YSJagan #TDP #YSRCP #AndraPradesh #Tupaki pic.twitter.com/3mLuDilCr6
— Tupaki (@tupaki_official) July 23, 2024
ఉన్నపలంగా రఘురామ కృష్ణంరాజులో ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. మరోవైపు కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు జగన్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం జగన్ గురించి రఘురామ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications