ఏపీ పరిస్థితేం బాగోలేదు, మూడు రాజధానులు ఎలా చట్టబద్ధం: అమిత్ షాకు రఘురామ లేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ రాజధాని విషయంలో పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అసెంబ్లీలో చట్టం ద్వారా సవరణ చేయడం కుదరదని రఘురామ అన్నారు.

ఏపీ మూడు రాజధానులు ఎలా చట్టం బద్ధం.
ఏపీకి మూడు రాజధానులు కావాలంటే మళ్లీ పార్లమెంటులోనే చట్టం చేయాలని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. అందుకే హైకోర్టు స్టే ఇచ్చిందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించినట్లే మూడు రాజధానుల అంశాన్ని కేంద్రమే పరిష్కరించాలన్నారు రఘురామ. విభజన చట్టంలో లేని విధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్లమెంటులో చట్టాన్ని సవరించినప్పుడే మూడు రాజధానులకు చట్టబద్ధత వస్తుందన్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని, శంకుస్థాపనకు ప్రధాని కూడా వచ్చారని గుర్తు చేశారు. కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాజధానికి మాత్రమే ఆర్థిక సాయం చేసిందని, చేస్తుందని, మూడు రాజధానుల ప్రస్తావన ఆ చట్టంలో లేదని అన్నారు.

ఏపీ ఆర్థిక పరిస్థితేం బాగోలేదు..
ఇక ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి చెబుతూ.. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనంత ఆర్థికి దుస్థితి ఏపీలో ఉందన్నారు. కేంద్రమే ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని రఘురామ కృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ఏపీకి మార్గనిర్దేశం చేయాలన్నారు.
Recommended Video

మూడు రాజధానుల దిశగానే సర్కారు అడుగులు
కాగా, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడే సచివాలయం, హైకోర్టు భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. అమరావతితోపాటు కర్నూలు, విశాఖపట్నంలను రాజధానులుగా ప్రకటించింది. శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ మేరకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కర్నూలులో ఏపీ మానవ హక్కుల సంఘం తరలివచ్చేందుకు సిద్ధమైంది.












Click it and Unblock the Notifications