నరసాపురమే కావాలంటున్న రఘురామ-అసెంబ్లీకి నో- టీడీపీని మోసం చేసిన బీజేపీ..!
ఏపీలో మరోసారి తన సిట్టింగ్ సీటు నరసాపురం లోక్ సభ స్దానం నుంచి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కనుమూరి రఘురామకృష్ణంరాజుకు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా హ్యాండిచ్చాయి. తాను కచ్చితంగా గెలుస్తానని భావిస్తున్న ఈ సీటులో పోటీకి ఉమ్మడి అభ్యర్ధిగా అవకాశం ఇస్తారని భావించగా.. అలాంటిదేమీ లేదని తాజాగా తేలిపోయింది. అదే సమయంలో విజయనగరం లోక్ సభ సీటుతో పాటు గోదావరి జిల్లాల్లోని ఉండి అసెంబ్లీ సీటును కూడా పరిశీలిస్తున్నారు. కానీ రఘురామ ఇవేవీ అంగీకరించడం లేదు.
తాజాగా రాష్ట్రంలో కొన్ని మీడియా ఛానళ్లలో మాట్లాడుతూ రఘురామ బీజేపీ, టీడీపీని ఇద్దరినీ ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా చంద్రబాబును ఉద్దేశించి తనకే టికెట్ ఇవ్వలేకపోతే పోలవరం కడతాను, రాష్ట్రానికి ఇంకేదో తెస్తామంటే ఎలా నమ్ముతారని రఘురామ ప్రశ్నించారు. తనకు నరసాపురం లోక్ సభ సీటు తనకు ఎందుకివ్వరని నిలదీశారు. విజయనగరమో ఇంకెక్కడో కాదని నరసాపురంలోనే తనకు సీటు ఇవ్వాలన్నారు.

అలాగే బీజేపీపై స్పందిస్తూ టీడీపీని నరసాపురం సీటు ఇస్తామని మోసం చేసిందంటూ రఘురామ ఆరోపించారు. తనకు ఇస్తామని చెప్పే నరసాపురం సీటుని బీజేపీ.. టీడీపీ నుంచి తీసుకుందని, కానీ ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. తద్వారా బీజేపీ మోసం చేసినా టీడీపీ అడగలేని పరిస్దితుల్లో ఉందని రఘురామ చెప్పకనే చెప్పేశారు. దీంతో ఇప్పుడు రఘురామ వ్యాఖ్యల్ని వైసీపీ కూడా ట్రోల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications