చంద్రబాబు చేసింది పూజలు కాదు షూటింగ్: రఘువీరా మండిపాటు
న్యూఢిల్లీ: గోదావరి పుష్కరాల్లో జరిగిన ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (ఎపిపిసిసి) అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిందించారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో చంద్రబాబు చేసింది పూజలు కాదు షూటింగ్ అని ఆయన అన్నారు.
నైతికంగా అధికారంలో కొనసాగే హక్కు చంద్రబాబు నాయుడికి లేదని ఆయన అన్నారు. ప్రచార ఆర్భాటం కోసమే ప్రజలను క్యూలైన్లలో నిలబెట్టారని, దానివల్ల తొక్కిసలాట చోటు చేసుకుందని ఆయన అన్నారు. బుధవారంనాడు తెలంగాణ, ఎపి కాంగ్రెసు నేతలతో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమావేశమయ్యారు.
ఆ తర్వాత రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 24వ తేదీన అనంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఒడిసి నుంచి కొండకమర్ల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని ఆయన చెప్పారు. రైతులు, వ్యవసాయ కూలీలతో రాహుల్ గాంధీ సమావేశమవుతారని ఆయన చెప్పారు.

రాహుల్ యాత్రను అడ్డుకుంటామన్న టీడీపీ నేతలపై రఘువీరా మండిపడ్డారు. రాహుల్ ను అడ్డుకుంటే జరగబోయే పరిణామాలకు టీడీపీయే బాధ్యతవహించాల్సి వస్తుందని తెలిపారు. రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే కారణమని రఘువీరా ఆరోపించారు. 12 ఏళ్ల క్రితం పుష్కరాలకు రూ.28 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు ఏకంగా రూ.1600 కోట్లు ఖర్చు చేశారని, దీంట్లో ఎంత అవినీతి జరిగిందో చంద్రబాబు చెప్పాలన్నారు.
చంద్రబాబుపై పుష్కరాల నిర్వహణకు సంబంధించి తాము కేసులు పెడతామని చెప్పారు. చంద్రబాబుపై కేసును కోర్టులు సుమోటోగా తీసుకోవాలని కోరారు. క్రెడిట్ వస్తే తనకు, వైఫ్యలాలు ఎదురైతే అధికారులకు ఆపాదించడం చంద్రబాబు నైజమని రఘువీరా విమర్శించారు. చంద్రబాబు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications