మోడీకి మోకరిల్లావ్:జగన్‌పై రఘువీరా, టిపిసిసిలో రగడ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవారం విరుచుకుపడ్డారు. ఆఘమేఘాల మీద వెళ్లి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ముందు మోకలిల్లాల్సిన అవసరం జగన్‌కు ఏమొచ్చిందన్నారు. తన మీదున్న కేసుల భయంతోనే మోడీ ముందు జగన్ తలవంచారన్నారు.
లౌకికవాదిగా చెప్పుకునే జగన్ మతతత్వ మోడీని ఎలా కలుస్తారన్నారు. సీమాంధ్రలో ముస్లింలకు, క్రైస్తవులకు ఛాంపియన్ అనిపించుకుంటున్న జగన్ తన ప్రవర్తనతో వారిని ఆవేదనకు గురి చేశారన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహిస్తామన్నారు.
మోడీ ముందు జగన్ మోకరిల్లడమంటే తన పైన ఉన్న కేసులను మాఫీ చేయాలని కోరినట్లేనని చెప్పారు. జగన్‌ను మోడీ కలవడం చూస్తుంటే పిలవని పేరంటానికి వెళ్లినట్లుగా ఉందన్నారు. ఆంధ్రప్రదశ్ కొత్త రాజధాని ఎంపిక కాగానే తాము కార్యాలయాన్ని మార్చివేస్తామని చెప్పారు.

టిపిసిసి సమావేశం రసాభాస
హైదరాబాదులో జరిగిన తెలంగాణ పిసిసి సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ నేతలతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అసమర్థ నేతల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయిందని పలువురు మండిపడ్డారు. టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనరసింహలను కార్యకర్తలు చుట్టుముట్టారు. దామోదర, పొన్నాలు పదవులలో ఉండి కూడా వ్యక్తిగతంగా గెలువలేకపోయారని, వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో దామోదర, మాజీ మంత్రి దానం నాగేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
నాయకుల వల్లే: రేణుక
తెలంగాణ నాయకుల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆరోపించారు. తెలంగాణ ఇస్తే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందని చెప్పి తామంతా సోనియా గాంధీని మోసగించామన్నారు. సీమాంధ్రలో పార్టీ ఘోర పరాజయాన్ని తాను అర్థం చేసుకోగలనని కానీ, కనీసం తెలంగాణలో కూడా పార్టీ సరిగ్గా రాణించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జైపాల్ రెడ్డి సోదరుడు ఔట్
వరంగల్ జెడ్పీ మాజీ చైర్ పర్సన్ ధన్వంతి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు రాంరెడ్డిలను కాంగ్రెసు పార్టీ బహిష్కరించింది. ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వీరిని ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పైన కూడా చర్యలకు సిద్ధమైనట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications