ఏపీలో కాంగ్రెస్ కూటమి సిద్దం, జగన్ పై గురి - చంద్రబాబు ఆశలపై నీళ్లు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తుల లెక్కలు మారుతున్నాయి. జగన్ సింగిల్ గానే పోటీకి దిగుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీల పైన నేరుగా రాహుల్ ఫోకస్ చేసారు. ఈ నెల 27న రాష్ట్ర నేతలతో కీలక భేటీకి నిర్ణయించారు. ఏపీలో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పైన ప్రాధమిక చర్చలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ఓట్లు పెంచుకుంటే ఎవరికి లాభం. ఎవరికి నష్టం.
ఏపీ వైపు కాంగ్రెస్ చూపు: వరుసగా దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీ పైన గురి పెట్టింది. జగన్ ఎంట్రీ..రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఏపీలో తుడిచి పెట్టుకుపోయింది. 2014, 2019 ఎన్నికల్లో కనీసం ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోలేదు. తెలంగాణలో విజయం తరువాత ఇప్పుడు ఏపీలోని రాజకీయ సమీకరణాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది.

తమ పార్టీ అడ్రస్ గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వైఎస్ షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమైంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతో ఏపీలో పొత్తు దాదాపు ఖరారైంది. సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఈ మేరకు చర్చలు పూర్తి చేసింది.
ఏపీలో పొత్తులు ఖరారు: ఏపీలో సీపీఎం వైఖరి పైన రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఈ సమయంలోనే ఈ నెల 27న ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ కీలక భేటీకి నిర్ణయించారు. త్వరలో ఏపీలో రాహుల్ ,ప్రియాంక పర్యటనకు రానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే సభలో రాహుల్ పాల్గొంటున్నారు. అదే విధంగా అమరావతికి మద్దతుగా నిర్వహించే సభలో ప్రియాంక పాల్గొనేలా కార్యాచరణ డిసైడ్ చేసారు.
జనవరి నెలలోనే ఈ రెండు సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు షర్మిలకు ఏపీలో బాధ్యతల పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జగన్ పైన వ్యతిరేకంగా ఉన్న ఓటు..తమకు సుదీర్ఘ కాలంగా సంప్రదాయంగా ఉన్న ఓట్ బ్యాంకు ఏపీలో తిరిగి తమ వైపు మళ్లుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.
చంద్రబాబుకు నష్టమేనా: ఇప్పుడు కాంగ్రెస్ ఏపీలో బలోపేతం దిశగా అడుగులు వేయటం జగన్ తో పాటుగా చంద్రబాబుకు నష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ సంప్రదాయ ఓట్ బ్యాంక్ ప్రస్తుతం పూర్తిగా జగన్ వైపు నిలిచింది. కాంగ్రెస్ వైపు ీ ఓట్ బ్యాంక్ ఏ మేర టర్న్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ, జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా జత కడుతున్నామని చెప్పిన చంద్రబాబు - పవన్ ఆశల పైన మాత్రం కాంగ్రెస్ తాజా నిర్ణయాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి.
2019 లో జగన్ కు ఓటు వేసిన వారిలో ఇప్పుడు తిరిగి వైసీపీకి వేయకూడదని భావిస్తే, చంద్రబాబు- పవన్ తో పాటుగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. దీంతో, వ్యతిరేక ఓటు చీలితే చంద్రబాబు ఆశలు ఫలించే అవకాశం లేదనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ కార్యాచరణ ఏంటనేది ఈ నెల 27న స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications