ఆర్డినెన్స్‌ను చించేయాలన్న రాహుల్ స్ఫూర్తి: బొత్స
హైదరాబాద్: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ నేతలందరూ పని చేయాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో గాంధీభవన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ వ్యాఖ్యలు సరైనవేనని ఆయన అన్నారు. తప్పులు ఎత్తిచూపేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు.
నేర చరితులు ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరికాదంటూ శుక్రవారం తమ ప్రభుత్వంపైనే రాహుల్ గాంధీ విమర్శలు చేసిన విషయం తెలిసిందె. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పై విధంగా స్పందించారు.

రాష్ట్ర విభజన విషయంలో ఒక్క కాంగ్రెస్ పార్టీనే తప్పుపట్టడం సరికాదని, అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే సిడబ్ల్యూసి నిర్ణయం ప్రకటించిందని ఆయన తెలిపారు. నిర్ణయాలు తీసుకున్నాం, అమలు చేయాలన్న వైఖరి కాంగ్రెస్‌లో ఉండబోదని బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి మంచి చేసే నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన అన్నారు.
ఇదిఇలా ఉండగా మంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో బొత్స సత్యనారాయణ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, నేతల రాజీనామా మొదలగు అంశాలపై భేటీలో చర్చించారు.












Click it and Unblock the Notifications