మేడిన్ టి వాచ్ పెడ్తా: మహిళా సిఎంతో రాహుల్ కౌంటర్
వరంగల్: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు. జూన్ 2న తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పాటవుతుందన్నారు. తెలంగాణ ప్రజల అరవయ్యేళ్ల కలను తాము సాకారం చేశామన్నారు. యూపిఏ అధికారంలోకి వచ్చాక ఎన్నో రైతుల సంక్షేమ కార్యక్రమాలు తాము చేపట్టామన్నారు.
రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవడం కాంగ్రెసు పార్టీకే సాధ్యమన్నారు. కెసిఆర్ మాట ఇచ్చి మరిచిపోయే రకమన్నారు. తెలంగాణ ఇచ్చినప్పుడు తన వద్దకు వచ్చి చేతిలో చేయి వేసి... ఆలింగనం చేసుకొని పార్టీని విలీనం చేస్తానని చెప్పి ఆ తర్వాత మాట మార్చారన్నారు. ఆయనకు మాట ఇవ్వడం తప్ప దానిని గుర్తుంచుకోవడం తెలియదన్నారు. కెసిఆర్ జవాబుదారిలేని వ్యక్తి అన్నారు. మాట మీద నిలబడలేని వ్యక్తి అన్నారు.

సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి తాము సహకరిస్తామని చెప్పారు. టిడిపి, బిజెపిలు తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడ్డాయన్నారు. తెరాస కంటే ముందే తెలంగాణ ఆకాంక్ష ఉందన్నారు. తెలంగాణ బిల్లు రూపకల్పనలో, బిల్లు ఆమోదంలో తెరాస పాత్ర ఏమాత్రం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఫలాలు అందరికీ దక్కాలని చెప్పారు. తాను కాంగ్రెసు పార్టీతో కలిసి సాగుతానని పదే పదే చెప్పిన కెసిఆర్ ఆ తర్వాత మాట మార్చారన్నారు.
దళిత ముఖ్యమంత్రి వాగ్దానాన్ని పక్కన పెట్టారన్నారు. ముఖ్యమంత్రి కావాలని కెసిఆర్ ఆరాటపడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఉత్పాదకతను కాంగ్రెసు పార్టీ ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణలో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటును నెలకొల్పుతామన్నారు. ఐదేళ్లలో తెలంగాణ యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పెంచామన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళను సిఎం చేస్తామన్నారు. కెసిఆర్ దళిత వ్యక్తిని సిఎంగా చేస్తానని మాట ఇచ్చి తప్పారని ఆరోపిస్తూ.. మహిళా సిఎంను చేస్తామని రాహుల్ చెప్పడం గమనార్హం.
మాట ఇవ్వడం.. తప్పడం కెసిఆర్ నైజం అన్నారు. రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఎయిమ్స్ స్థాయి వైద్య సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్‌ను రెండో హైటెక్ సిటీగా మార్చుతామని చెప్పారు. మీ మేడిన్ తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చుతామన్నారు. వివిధ పార్టీల రకరకాల హామీలు ఇస్తున్నప్పటికీ కాంగ్రెసు పార్టీ వల్లనే అవి సాధ్యమన్నారు. వరంగల్‌ను టెక్స్‌టైల్ హబ్ గా మారుస్తామన్నారు. భూపాలపల్లిలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
ఇందిరా గాంధీని, రాజీవ్ గాంధీని, సోనియా గాంధీలతో మీకు ఎలాంటి అనుబంధం ఉందో.. అలాగే ఈ రాహుల్ గాంధీని మీవాడిగా అనుకోవాలని కోరారు. తెలంగాణ మహిళా శక్తి గురించి అందరికీ తెలుసునని వారందరూ ముందుకు రావాలన్నారు. మహిళల కోరిక మేరకు ఏడాదికి 9 సిలిండర్ల నుండి 12కు పెంచామన్నారు. తెలంగాణ కాంగ్రెసు వల్లనే సాకారమైందని తెరాస వల్ల కాదన్నారు.
హైదరాబాద్ సభలో...
రాహుల్ గాంధీ సాయంత్రం హైదరాబాద్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిజెపి, టిడిపిలు తెలంగాణ రాకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు. గత పదేళ్లలో వివిధ కార్యక్రమాలరూపంలో విద్వేషాలు రేపేందుకు విపక్షాలు ప్రయత్నించాయన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాద్ అందరి నగరంమని, ఏ ఒక్కరికో చెందిన నగరం కాదని గుర్తించాలని ఆయన అన్నారు.
దేశంలో, తెలంగాణలో ఏ వస్తువు కొనుగోలు చేసినా మేడిన్ చైనా అని కనబడుతోందని. ఆయా వస్తువులు కొన్నప్పుడు కట్టే రుసుం చైనాకు వెళ్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ రంగంలో నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందిందన్నారు. భవిష్యత్‌లో హార్డ్ వేర్ రాజధానిగా కావాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్‌లో దేశంలో ఏ వస్తువు కొన్నా మేడిన్ హైదరాబాద్ అని ఉండాలన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలను అనుసంధానం చేస్తూ హార్డ్ వేర్ కారిడార్ రూపకల్పన చేశామని ఆయన చెప్పారు. తాను కూడా మేడిన్ తెలంగాణ వాచ్ పెట్టుకోవాలనే కోరిక ఆయన వ్యక్తం చేశారు. తనకు మేడిన్ తెలంగాణ వాచ్ కావాలన్నారు. మౌలిక సదుపాయలతో జాతీయ స్థాయి రవాణా సౌకర్యాన్ని రూపొందించామన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మెట్రో రైలు రూపకల్పన కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దామన్నారు.
తనకు మేడిన్ తెలంగాణ వాచ్ కావాలన్నారు. తెలంగాణ వస్తు ఉత్పత్తికి మారుపేరుగా నిలవాలన్నది తన స్వప్నమన్నారు. ఇప్పటికైతే తనకు వాచ్ లేదని మేడిన్ తెలంగాణ వాచ్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభలో కరతాళధ్వనులు చేశారు.












Click it and Unblock the Notifications