ఏపీ వాసులకు రైల్వే శాఖ అదిరిపోయే న్యూస్, కష్టాలకు చెక్..!!
ఏపీలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు.. స్టేషన్ల పైన సీఎం చంద్రబాబు రైల్వే అధికారులతో చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీని బెంచ్‌మార్క్‌గా నిలపాలని రైల్వే అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల కు అమరావతి కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్దేశించారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అమృత్ పథకం కింద ఎంపికైన 73 రైల్వేస్టేషన్లను 2027 నాటికి అభివృద్ధి చేయాలని సూచించారు.
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు.. అమరావతి కనెక్టివిటీ పైన రైల్వే అధికారులతో సీఎం చంద్రబాబు కీలక అంశాలను చర్చించారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయని.. మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో ప్రధాన లైన్లను త్వరితగతిన అనుసంధానం చేయాలని సీఎం పేర్కొన్నారు. తిరుపతి- రేణిగుంట ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా తయారవుతోందని, దీనిని ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానిస్తే పారిశ్రామిక ఉత్పత్తులను వేగంగా, తక్కువ వ్యయానికే రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. ఇచ్ఛాపురం- తడ మధ్య నాలుగు వరుసల రైల్వేలైన్ల నిర్మాణం వచ్చే మూడేళ్లలో కార్యరూపం దాల్చేలా డీపీఆర్ తయారు చేయాలని రైల్వే అధికారులకు సూచించారు.

అమరావతికి ప్రధాన నగరాలతో కనెక్టివిటీ
రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ, భూసేకరణ తదితర ప్రక్రియలకు రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా డిప్యూటీ తహసీల్దార్లను నియమించాలని ఆదేశించారు.రాష్ట్రంలో అమృత్ పథకం కింద ఎంపికైన 73 రైల్వేస్టేషన్లను 2027 నాటికి అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అలాగే రాయలసీమ- కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్టవిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట తదితర రైల్వే జంక్షన్లలో రద్దీని తగ్గించడంపైనా చర్చించారు. రాజధాని అమరావతిని కలుపుతూ ఎర్రుపాలెం- నంబూరు కొత్త రైల్వేలైన్ నిర్మాణ ప్రతిపాదనను త్వరగా పట్టాలెక్కించాలని సూచించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాలను అమరావతి కోర్ కేపిటల్‌తో కలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications