దక్షిణ మధ్య రైల్వే కుదింపు - విశాఖ జోన్ లో కొత్తగా, ఈ మార్గాలకి 'కవచ్'..!!
రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ప్రారంభం కావటంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆరు డివిజన్ల ను సర్దుబాటు చేసింది. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మూడు డివిజన్లను విశాఖ దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రైల్వే బోర్డుకు డీపీఆర్ లో డివిజన్ల హద్దులు మార్చాలంటూ ప్రతిపాదనలు వెళ్లాయి.
ఇదే సమయంలో గుంటూరు.. గుంతకల్ డివిజన్ల పరిధిలో కవచ్ వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
దక్షిణ మధ్య రైల్వే కుదింపు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ 6 డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు సౌత్ సెంట్రల్ రైల్వేలో మిగులుతాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌లోకి వెళతాయి. ఇందులో సికింద్రాబాద్, గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్ల సరిహద్దుల్లో మార్పులకు గానూ ప్రతిపాదనలు వెళ్లాయి.

తెలంగాణ రాష్ట్రంలోని విష్ణుపురం-పగిడిపల్లి, విష్ణుపురం-జాన్‌పహాడ్ సెక్షన్లు ప్రస్తుతం ఏపీలోని గుంటూరు డివిజన్‌లో ఉన్నాయి. వీటిని సికింద్రాబాద్ డివిజన్‌లో కలపాలని ప్రతిపాదించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, మహారాష్ట్రలోని వాడి మధ్య ఉన్న సెక్షన్ ప్రస్తుతం గుంతకల్ పరిధిలో ఉంది. దీన్ని సికింద్రాబాద్‌లో కలపాలని అధికారులు ప్రతిపాదించారు. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌లో రాయగడ డివిజన్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఈ డివిజన్ పరిధిలోకి ఏపీ ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు రానున్నాయి. జోన్ల పరిధి.. డివిజన్ల మార్పు గురించి రైల్వే శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఇక, తాజాగా రైల్వే శాఖ రైలు ప్రమాదాల నివారణ కోసం కవచ్ వ్యవస్థ ను గుంటూరు, గుంతకల్ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా రెండు డివిజన్ల పరిధి లో రూ 204 కోట్లతో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా ఈ రెండు డివిజన్ల పరిధిలోని రైల్వే స్టేషన్లు, లెవల్ క్రాస్ గేట్లు, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్, రిమోట్ ఇంటర్ ఫేర్ యూనిట్ల వద్ద ఈ కవచ్ ను ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థ ద్వారా ఈ రెండు డివిజన్ల పరిధిలో ఎదురెదురుగా.. ఒకే దాని వెనుక మరొకటి రైళ్లు ఢీ కొనే అవకాశం లేకుండా ప్రమాద రహితంగా మార్పు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications