పొడుగుపాడుపై తొలి పంజా: వణుకుతున్న శ్రీకాకుళం తీరం: ఇచ్ఛాపురంలో దిగిన ఎన్డీఆర్ఎఫ్
Recommended Video
శ్రీకాకుళం: పొడుగుపాడు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ తీర ప్రాంత గ్రామం. ఫొని తుఫాన్ విసురుతున్న తొలి దెబ్బను రుచి చూస్తోంది. తుఫాన్ ధాటికి వణికిపోతోంది. తీర ప్రాంతంలో వీస్తోన్న బలమైన ఈదురు గాలులకు చెట్లన్నీ నెలకొరిగాయి. మత్స్యకారుల నివాసాలు నేలమట్టమయ్యాయి. పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గురువారం ఉదయం నుంచీ పొడుగుపాడులో నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, సంతబొమ్మాళిల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది.
పొడుగుపాడు సహా శ్రీకాకుళం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలాస, టెక్కలి, సంతబొమ్మాళిల్లో తెల్లవారు జాము నుంచీ వర్షం పడుతోంది. మిగిలిన చోట్ల తేలిక పాటి జల్లులు పడుతున్నాయి. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు పట్టణం ఇచ్ఛాపురంలో తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఇచ్ఛాపురంలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (ఈపీడీసీఎల్) అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇచ్ఛాపురం సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చెట్ల కొమ్మలు విరిగిపడటం వల్ల పలు చోట్ల విద్యుత్ తీగలు తెగి పడ్డాయి.

20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం..
జిల్లాలోని సోంపేట మండలం తీర ప్రాంత గ్రామాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల 20 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకుని వచ్చింది. బారువ సమీపంలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చినట్లు సమాచారం. దీనితో పాటు- ఎర్రముక్కం గ్రామం సమీపంలో కూడా సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.

ఇచ్ఛాపురంలో చేరిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఫొని తుఫాన్ పెను విలయాన్ని సృష్టించే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో- ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. సరిహద్దు పట్టణం ఇచ్ఛాపురంలో పెద్ద ఎత్తున జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాల (ఎన్డీఆర్ఎఫ్)ను మోహరింపజేసింది. ఎన్డీఆర్ఎఫ్ దళ సభ్యులు గురువారం ఉదయం ప్రత్యేక వాహనంలో ఇచ్ఛాపురానికి చేరుకున్నారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కవిటి, డొంకూరు, మాణిక్యపురం గ్రామాలపైనా తుఫాన్ ప్రభావం చూపుతుందని భావిస్తోన్న జిల్లా పాలనాయంత్రాంగం అక్కడ ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

జిల్లాధికారులతో ఎల్వీ టెలిఫోన్ కాన్ఫరెన్స్..
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సహా వివిధ విభాగాల జిల్లా స్థాయి అధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యానవనాలు, విద్యుత్, రెవెన్యూ అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ అధికారుల నుంచి అందిన సమాచారాన్ని వారికి వివరించారు. ప్రాణ, ఆస్తినష్టాలను గణనీయంగా తగ్గించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సెలవుల్లో ఉన్న అధికారులను వెనక్కి పిలిపించుకోవాలని చెప్పారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లతోనూ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు.

90 కిలోమీటర్ల వేగంతో గాలులు..
తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఎల్వీ అన్నారు. తుఫాన్ ధాటికి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారని, దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

తిత్లీ కంటే భయానకం?
గత ఏడాది శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాలను కకావికలం చేసిన తిత్లీ తుఫాన్ కంటే ప్రస్తుతం రాబోతున్న ఫొని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిత్లితో పోల్చుకుంటే- నష్టం కూడా అధికంగా ఉండొచ్చని చెబుతున్నారు. తిత్లీ తుఫాన్ ను ఎదుర్కొన్న అనుభవం ఉన్నందున- రాబోయే ఫొని తుఫాన్ అనంతరం సమర్థవంతంగా నిర్వహణ చర్యలను చేపట్టడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమౌతోంది. తీవ్ర పెను తుపానుగా మారిన ఫోని ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో తుపాను ప్రభావం స్పష్టం కనిపిస్తోంది. కొన్ని చోట్ల అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications