ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావం వల్ల మొన్నటివరకూ ఏపీలో అతి భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కంభం చెరువు సైతం పూర్తిగా నిండింది. అలుగు పారుతోందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇవే పరిస్థితులు ఈ వారం కూడా కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నిచోట్ల ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదు. ఈ వర్షాల తీవ్రత ఉత్తర కోస్తా, కోస్తా జిల్లాలపై అధికంగా ఉండబోతోంది.

నేడు అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఉపనదులు ప్రమాదకరంగా ఉప్పొంగుతున్నాయని అన్నారు. వాటిని దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ఎగువ భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం ఉధృతంగా ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 6:30 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67లక్షల క్యూసెక్కులు ఉందని వివరించారు. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఎగువ వర్షాలకు కృష్ణానది కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉందని, కృష్ణా, పెన్నా నదీ పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈదురుగాలులు వీచే సమయంలో హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద తలదాచుకోవద్దని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications