ద్రోణి ప్రభావం: ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన; అన్నదాతల ఆందోళన!!
వేసవికాలం ప్రారంభంలో ఒక్కసారిగా బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వాతావరణం మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఐ ఎం డి అంచనాల ప్రకారం జార్ఖండ్ నుండి ఒడిస్సా మీద ఉత్తర కోస్తాంధ్ర నార్త్ కోస్ట్ వరకు ఈ అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం రాత్రి నుండి బుధవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా వాతావరణ పరిస్థితి పైన విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ ఒక ప్రకటన చేశారు. బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.

ఇక మిగిలిన జిల్లాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంటలను ఎలా కాపాడుకోవాలని దిగులు చెందుతున్నారు. ఇదిలా ఉంటే అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడనున్న క్రమంలో చెట్లకు టవర్స్ కు, పోల్స్ కు కింద ఉండకూడదని, పొలాలు బహిరంగ ప్రదేశాలలో కూడా ఉండకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
గత ఏడాది కాలంగా ఏపీలో అన్నదాతలకు ప్రకృతి సహకరించటం లేదు. పంట చేతికి వచ్చే సమయానికి ఏదో ఒక తుఫాను రావటంతో అన్నదాతలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతున్నారు. ఒకవైపు తుఫానులు, అకాల వర్షాలు, రాయలసీమ వంటి ప్రాంతాలలో మరోవైపు వర్షాభావ పరిస్థితులతో నానా అగచాట్లు పడుతున్నారు.












Click it and Unblock the Notifications