Rains : ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక..
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇక, ఏపిలోని రెండు జిల్లాల్లో ఆదివారం నుంచి వర్షాలు మొదలవ్వగా, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా తమిళనాడుకు సరిహద్దున ఉన్న రాయలసీమలోని పలు జిల్లాలకు ప్రభావం పడింది. ముఖ్యంగా రాయలసీమలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావంతో తీవ్రంగా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇక్కడ వర్షాలు మొదలయ్యాయి. ఈ వానతో ఇప్పటికే తిరుమల వెళ్లే భక్తులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు చలి, మరోవైపు వర్షపు జల్లులతో జనాలు అల్లాడిపోతున్నారు. మరోవైపు తిరుమలలో ఒక్కసారిగా వాతావరణమంతా పూర్తిగా మారిపోయింది.

నేడు తిరుపతికి భారీ వర్ష సూచన : ఏపీలోని దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, తిరుమల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతున్నాయి. ఇక, నేడు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో 24.6, తిరుపతి జిల్లా తడలో16.8, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 12.2, తిరుపతి జిల్లా గూడూరులో 10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications