విచారణ జరపండి, కడిగిన ముత్యంలా వస్తా: రాజయ్య
హైదరాబాద్: తాము చేసిన పొరపాటు ఏమిటో తేల్చాలని, తప్పకుండా విచారణ జరిపించాలని ఉద్వాసనకు గురైన ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపితే కడిగిన ముత్యంలా బయటికి వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం రాజయ్య ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు.
ఛాతీలో నొప్పి, అధిక రక్తపోటు, షుగర్, ఒళ్లంతా చెమటలు పట్టడంతో అసెంబ్లీ సమీపంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మూడున్నర గంటల తర్వాత రాత్రి 9.30 గంటల సమయంలో రాజయ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స అవసరమన్న తమ సూచనను తోసిరాజని ఆయన డిశ్చార్జి అయ్యారని వైద్యవర్గాలు తెలిపాయి.

ముందు నుంచే బీపీ, షుగర్ ఉన్నాయని, నాలుగు రోజులుగా ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదని, తాను వైద్యుడినే అయినా ఎందుకనో బీపీ కంట్రోల్ చేసుకోలేకపోయానని రాజయ్య అన్నారు. బీపీ 130-80 ఉందని, షుగర్ లెవల్స్ 340కి చేరిందని, నిజానికి అంతకుముందే ఆస్పత్రికి వద్దామనుకున్నానని, అభిమానులు, కార్యకర్తలు మరోలా అనుకుంటారని ఇన్నా ళ్లూ ఎలాగో నెట్టుకువచ్చానని ఆయన చెప్పారు.
ఇప్పుడు ఒక్కసారిగా చెమటలు పట్టడంతో కుటుంబ సభ్యులు తనను ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. బర్తరఫ్ తర్వాత తాను ఒత్తిడికి గురయ్యానని, తనకు అన్యాయం జరిగిందని అన్నారు. తండ్రిలాంటి ముఖ్యమంత్రి తాను చేసిన పొరపాట్లపై విచారణ జరిపించాలని, ఏ విచారణ జరిపినా, తప్పకుండా కడిగిన ముత్యంలా బయటపడతానని తెలిపారు. చికిత్స చేయించుకోవాలని వైద్యులు చేసిన సూచనను కాదని చెప్పి తన అభిమానులు, ప్రార్థనాపరులకు అందుబాటులో ఉండేందుకు ఇంటికి వెళ్తున్నానని రాజయ్య చెప్పారు.
మాదిగ జాతికి చెందిన తాను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవిని వదిలేశానని, తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినట్లు వచ్చిన సమాచారం, కార్యకర్తలు, అభిమానుల ఆవేదనతో మానసిక ఆందోళనకు గురయ్యానని తెలిపారు.
తనకు జరిగిన అన్యాయంపై మంత్రులందరినీ, ఆ తర్వాత కేసీఆర్‌ను కలిసి తన వాదన వినిపిద్దామని రాజయ్య అనుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మంత్రులు జిల్లాల పర్యటనలో ఉండటంతో మంగళవారం ఆయన ఎవరినీ కలవలేకపోయారు. మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆరు గంటల ప్రాంతంలో కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే రాజయ్యను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications