ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కడ ఎన్ని స్థానాలు.. ఇదీ లెక్క..!!
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం.. ఎన్నికల సంఘం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కీలకంగా మారుతోంది. ఇప్పటికే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల పైన కీలక సిఫారసులతో నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో బీసీలు 50.26 శాతం ఉన్నట్లు తేల్చిన కమిషన్.. దీని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ధారిస్తూ సిఫారసులు చేసింది. ఈ లెక్కన ఎక్కడ బీసీలకు ఎన్ని స్థానాలు దక్కుతాయనే అంచనాలు మొదలయ్యాయి.
ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పైన రాజీవ్ రంజన్ మిశ్రా ప్రభుత్వానికి అందించిన నివేదిక లో కీలక అంశాలను ప్రస్తావన చేసింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 50.26 శాతం ఉన్నట్లు కమిషన్ తేల్చింది. దీని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి సిఫారసులు చేసింది. దీంతో.. నోటిఫై చేసిన షెడ్యూలు ఏరియాల్లో మొత్తం సీట్లను ఎస్టీలకు మాత్రమే కేటాయించాల్సి ఉంది. మిగిలిన నాన్-షెడ్యూల్ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల స్థానాల్లో మాత్రమే బీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీని ప్రకారం.. పంచాయతీ వార్డులు కాకుండా.. ఇతర స్థానిక సంస్థల స్థానాల్లో బీసీలకు 27.66 శాతం స్థానాలు లభిస్తున్నాయి. 2021లో ఇది 23.84 శాతం మాత్రమే. అంటే... గతంలో కంటే ఇప్పుడు 3.82 శాతం కోటా పెరిగినట్లు. పంచాయతీ వార్డులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మారే అవకాశం ఉంటుంది.

తాజా ప్రతిపాదనలు.. లెక్కలు
కాగా.. నాన్ షెడ్యూల్ ఏరియాలో మొత్తం 11,190 సర్పంచ్ స్థానాలున్నాయి. వీటిలో 27.95 శాతం బీసీలకు కేటాయించాలని కమిషన్ సూచన చేసింది. ఇక, ఎంపీపీలు 24.6 శాతం, ఎంపీటీసీలు 25.55 శాతం, జడ్పీటీసీలు 24.6 శాతం, జడ్పీ చైర్‌పర్సన్‌లు 23.08 శాతం బీసీలకు కేటాయించాలని కమిషన్ సిఫారసు చేసింది. కార్పొరేషన్ల మేయర్లలో 35.29 శాతం బీసీలకు కేటాయించాలని స్పష్టం చేసింది. గతంలో ఈ సంఖ్య 31.25 శాతం మాత్రమే. ఇక.. మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌లు 33.02 శాతం కేటాయించాలని తెలిపింది. గతంతో పోల్చితే ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. పట్టణ స్థానిక సంస్థల వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్ మాత్రం గతంలో 30.73 శాతం ఉండగా... ఇప్పుడు దానిని 32.78 శాతానికి పెంచాలని కమిషన్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ సిఫారసుల పైన అధ్యయనం చేసి.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీ అమలు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications