చంద్రబాబుతో ఫైట్: వర్మ కామెంట్లు, చింపబడ్డ పేజీలేవి....
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా రాజకీయ వేడి పుట్టించారు. సినిమా టైటిల్‌తోనే ఆయన చెప్పదలుచుకున్న విషయాలు, చేర్చదలుచుకున్న సంఘటనలు ఏమిటో అర్థమవుతోంది.
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా రాజకీయ వేడి పుట్టించారు. సినిమా టైటిల్‌తోనే ఆయన చెప్పదలుచుకున్న విషయాలు, చేర్చదలుచుకున్న సంఘటనలు ఏమిటో అర్థమవుతోంది.
రామ్ గోపాల్ వర్మ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నాయలు కూడా అర్థం చేసుకున్నారు. దాంతో ఆయనపై భగ్గుమంటున్నారు. చాలా రోజుల పాటు మౌనం వహించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోరు విప్పారు.
ఎన్టీఆర్ జీవితంలో చించేసిన పేజీలను అతికిస్తా: చంద్రబాబుకు వర్మ కౌంటర్
ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని ఆయన అన్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమాపై మాట్లాడవద్దని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. అయితే, చంద్రబాబు వ్యాఖ్యకు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా గట్టి సమాధానమే ఇచ్చారు.

వర్మ కామెంట్లు ఇవి...
లక్ష్మి'స్ ఎన్టీఆర్‌లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ముమ్మాటికీ నిజం. అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం వక్రీకరించకుండా తియ్యబోతున్నాను. CBN గారన్నట్టు NTR జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి'స్ ఎన్టీఆర్‌లో నేను ఆ పుస్తకంలోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను.
Recommended Video


చిరిగిపోయిన పేజీలు ఏవి...
వర్మ సినిమాకు సంబంధించిన వస్తువు ఆయన చెప్పిన మాటలను బట్టే అర్థం చేసుకోవచ్చు. చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలను తాను సినిమా ద్వారా అతికిస్తానని వర్మ చెబుతున్నారు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడం దగ్గర నుంచి ఆయనను అధికారం నుంచి తొలగించడం వరకు జరిగిన సంఘటనలు అప్పట్లో తీవ్రమైన ఉత్కంఠను కలిగించాయి. ఓ రకంగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించాయి.

ఇలా ప్రకటన....
అనూహ్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సి వచ్చింది. ఈ కాలంలోనే జీవిత చరిత్ర రాస్తానని చెప్పి లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావుకు దగ్గరైందని అంటారు. ఈ క్రమంలోనే ఆయన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని అంటారు. అయితే, ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న కాలం. తిరిగి అధికారంలోకి రావాల్సిన అనివార్యతలో ఎన్టీ రామారావు పడ్డారు. ఈ సమయంలో లక్ష్మీపార్వతితో వివాహం అంటే, పార్టీపై ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడవచ్చునని కొంత మంది ఎన్టీఆర్‌కు నచ్చజెప్పినట్లు ప్రచారంలో ఉంది. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ తిరుపతి ఎన్నికల ప్రచార సభలో లక్ష్మీపార్వతితో తన వివాహం విషయాన్ని ప్రకటించారు.

ఎన్నికలపై ప్రభావం చూపలేదు...
ఎన్టీఆర్ తాను లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ తెలుగుదేశం విజయావకాశాలపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. తెలుగుదేశం పార్టీ అనూహ్యమైన మెజారిటీతో విజయదుందుభి మోగించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. చంద్రబాబు మంత్రివర్గంలో చేరారు. అయితే, లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ వచ్చారు. చంద్రబాబుకు లక్ష్మీపార్వతి పాత్ర నచ్చలేదు. క్రమంగా లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శల జడివాన కురువడం ప్రారంభమైంది. అయితే, ఆ విమర్శలను లక్ష్మీపార్వతి కొట్టిపారేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ఏకమయ్యారు.

వాటిని ఎలా చూపుతారు....
లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించడానికి ముందు జరిగిన సంఘటనలు ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియవు. వాటిని వర్మ ఎలా చూపిస్తారనే ఆసక్తి కలగడం సహజం. అలాగే, ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి లోలోన జరిగిన విషయాలను ఎలా చిత్రీరిస్తారనేది కూడా ఆసక్తి కలిగించే విషయమే. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబును వర్మ ఎలా చిత్రిక కడుతారనేది కూడా చూడాల్సి ఉంది. చంద్రబాబుకు సినిమా వ్యతిరేకంగా ఉంటుందనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

అధికారం నుంచి దించేవరకు..
ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి నాటకీయమైన సంఘటనలే చోటు చేసుకున్నాయి. చంద్రబాబు పార్టీ నాయకులను, పార్టీ ఎమ్మెల్యేలను కూడగట్టుకున్నారు. తన వ్యతిరేక శిబిరంలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో పాటు కుటుంబ సభ్యుల మద్దతును కూడా కూడగట్టుకున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. దీనికోసం వైస్రాయ్ హోటల్లో క్యాంప్ రాజకీయాలు నడిపారు. అక్కడికి రావడానికి ప్రయత్నించిన ఎన్టీఆర్‌ను అడ్డుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలే జరిగాయి. ఎన్టీఆర్‌పైకి చెప్పులు కూడా విసిరారు. బహుశా ఇంతటి అవమానాన్ని ఎన్టీఆర్ తన జీవితంలో చూసి ఉండరు. ఈ కారణంగానే ఆయన తీవ్ర మనస్తాపానికి, మనోవేదనకు గురయ్యారని అంటారు.

ఆ పేజీలేనా...
చిరిగిపోయిన లేదా చింపివేయబడ్డ పేజీలను అతికిస్తానని వర్మ చెబుతున్నారంటే, లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను, ఆ తర్వాత అధికార మార్పిడి కోసం జరిగిన నేపథ్యాన్ని చిత్రీరించబోతున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ సినిమా కచ్చితంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందని భావించడానికి వీలు కలుగుతోంది. ఆ చిరిగిపోయిన, చింపివేయబడ్డ పేజీలు అవే అనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications