తిరుమలలో..ఈ నెల 6,7 తేదీల్లో రాత్రివేళ
Ram Navami 2025: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 73,007 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,440 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.04 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ నెల 6వ తేదీన శ్రీరామ నవమి. అయోధ్యలోని రామ్ లల్లా ఆలయం మొదలుకుని దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో ఏటేటా అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అదే రోజున శ్రీవారి ఆలయంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. నవమి నాటి ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరగనుంది. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు.
దీనితోపాటు- ఆ మరుసటి రోజు అంటే 7వ తేదీన శ్రీ రామ పట్టాభిషేకం ఉత్సవాన్ని నిర్వహించనున్నారు టీటీడీ అర్చకులు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని రాత్రి 8 నుండి 9 గంటల మధ్య బంగారువాకిలి వద్ద ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications