మోసం: రాంకీ ఉద్యోగి అరెస్టు, ప్రాణహాని ఉందని ఆరోపణ
హైదరాబాద్: తాను పనిచేస్తున్న సంస్థలో సుమారు 80 లక్షల మేర మోసానికి పాల్పడ్డ ఉద్యోగిని హైదారబాదులోని పంజాగుట్ట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన విజయరామిరెడ్డి రాజ్‌భవన్ రోడ్డులోని రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 1995లో చిరు ఉద్యోగిగా చేరాడు. అంచలంచెలుగా ఫైనాన్స్ విభాగం జీఎంగా ఎదిగాడు.
ఇతను రాంకీ సీఎండీ అయోధ్య రామిరెడ్డికి దగ్గరి బంధువు. బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యోగులపై వేధింపులకు పాల్పడేవాడు. 2008-12 సంవత్సరాల మధ్య జీఎంగా పనిచేస్తున్నప్పుడు సుమారు 23 లక్షలు దుర్వినియోగం చేయడంతో పాటు దారి మళ్లించాడు. వీటితో పాటు మరో 60 లక్షలు దారి మళ్లించినట్టు వెలుగులోకి వచ్చింది. భార్య, సోదరుడి పేరుతో సంస్థకు చెందిన కాంట్రాక్ట్‌లను బినామీగా తీసుకునేవాడు. ఇటీవల ఇతని బండారం బయటపడింది.

దాంతో కొద్దికాలంగా కార్యాలయానికి రావడం లేదు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో సంస్థ ప్రతినిధి శివకుమార్ కొద్దిరోజుల క్రితం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం నర్సరావుపేటలో విజయరామిరెడ్డిని అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ స్వయంగా అతనిని విచారించారు.
ఆయన ఆదేశం మేరకు పోలీసులు సంస్థకు చెందిన కంప్యూటర్లను, పత్రాలను సీజ్ చేశారు. సీఐ మోహన్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం ఎంత మొత్తంలో నిధులు దారి మళ్లాయో తెలుస్తుందని సీఐ తెలిపారు.
రాంకీ సీఎండీ అయోధ్య రామిరెడ్డితో తమకు ప్రాణహాని ఉందని విజయరామిరెడ్డి సోదరుడు రామిరెడ్డి ఆరోపించారు. తన సోదరుడ్ని అనవసరంగా కేసులో ఇరికించారని, అతనికి ఏదైనా జరిగితే అయోధ్య రామిరెడ్డే బాధ్యత వహించాలని అన్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దర్యాప్తు చేస్తే దోషులు ఎవరనేది తేలుతుందన్నారు.












Click it and Unblock the Notifications