జనసేనలో రాపాక చిచ్చు - రీఎంట్రీ, కార్యకర్తల ఫైర్..!!
కోనసీమ జనసేనలో కొత్త చిచ్చు మొదలైంది. 2019లో జనసేన నుంచి గెలిచి పార్టీ వీడిన రాపాక వర ప్రసాద్ తిరిగి ఇప్పుడు పార్టీ సమావేశంలో వేదిక పైన దర్శనమిచ్చారు. పవన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రాపాక ఇప్పుడు తిరిగి జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీని పైన జనసైనికులు మండిపడుతున్నారు. రాపాక రాకను వ్యతిరేకిస్తున్నారు. రాజోలు జనసేనలో ఇప్పుడు ఈ వ్యవహారం వివాదంగా మారుతోంది.
రాపాక ఎంట్రీ వెనుక
2019 ఎన్నికల్లో జనసేన ఒకే ఎమ్మెల్యేను గెలుచుకుంది. ఆ తరువాత కొంత కాలానికే రాజోలు నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక అధికార వైసీపీకి దగ్గరయ్యారు. జనసేనాని పవన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు. దీంతో, రాజోలు బాధ్యతలను మాజీ ఐఏఎస్ అధికారి వర ప్రసాద్ కు పవన్ అప్పగించారు. తాజా ఎన్నికల్లో ఆయనకే సీటు ఇవ్వగా దేవ వర ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసిన రాపాక వర ప్రసాద్ ఓడిపోయారు. అప్పటి నుంచి మౌనంగా ఉన్న రాపాక తాజాగా జనసేన సమావేశ వేదిక పైన ప్రత్యక్షమయ్యారు.

రాపాక రాక పై
పార్టీ వేదిక పైన రాపాక కనిపించటంతో కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. గెలిచిన పార్టీని కాదని వెళ్లి..పవన్ పైన విమర్శలు చేసిన రాపాక తిరిగి పార్టీ సమావేశానికి ఎలా వస్తారని నిలదీసారు. రాపాక తిరిగి జనసేనలో చేరేందుకు ముఖ్య నేతలతో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం పైన వారు మండిపడుతున్నారు. రాజోలు జనసేనలో రాపాకకు తిరిగి ఎంట్రీ ఇచ్చేది లేదని నినదించారు. అయితే, ఈ అంశం పైన స్థానిక జనసేన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ స్పందించారు. మలికిపురంలో కాలేజీ లెక్చరర్ల అంశమే రాపాక మాట్లాడారని..ఎలాంటి రాజకీయ అంశాలు రాలేదని ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ వివరించారు.
కార్యకర్తల ఆగ్రహం
అయితే, రాపాక మాత్రం ఎన్నికల ఫలితాల తరువాత ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. కూటమిగా మూడు పార్టీలు జత కట్టటం ఆ పార్టీలకు కలిసి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకు పవన్ పైన విమర్శలు చేసిన రాపాక ఆ తరువాత ఎలాంటి వ్యతిరేక కామెంట్స్ చేయలేదు. ఇప్పుడు పార్టీ వేదిక పైన ప్రత్యక్షం కావటంతో రాపాక రాజకీయంగా వేస్తున్న అడుగుల పైన చర్చ జరుగుతోంది. అయితే, రాపాకకు మాత్రం జనసేనలో రీ ఎంట్రీకి అవకాశం లేదని జనసేన నేతలే తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications