ఉపరాష్త్రపతి వెంకయ్య - సీజేఐ ఇద్దరూ ఒకే సమయంలో : మళ్లీ ఛాన్స్ దక్కేదెన్నడు..!!
ఇద్దరు తెలుగు ప్రముఖులు దేశంలోనే కీలక పదవుల్లో ఉన్నారు. ఆ ఇద్దరూ సుదీర్ఘ కాలం తమ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. కీలక స్థానాలకు ఎదిగారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరూ ఒకే సారి..కొద్ది రోజుల తేడాతో పదవీ విరమణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ ఆసక్తి కర చర్చగా మారింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వెంకయ్య నాయుడు.. భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ ఇద్దరూ ఆగస్టులో తప పదవులు వీడనున్నారు.

వెంకయ్య నాయుడు పదవీ విరమణతో
ఆగస్టు 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగియనుంది. అదే విధంగా ఆగస్టు 26తో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం ముగుస్తుంది. దాదాపుగా అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒకే పార్టీ.. ఒకే సిద్దాంతంతో వెంకయ్య నాయుడు మరో పార్టీ వైపు చూడకుండా బీజేపీలో కొనసాగారు. విద్యార్ధిగా రాజకీయాల్లోకి ప్రవేశించి..బీజేపీకి కష్టకాలంలో జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించి.. అనేక కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పని చేసి.. ఉప రాష్ట్రపతి అయ్యారు. అదే సమయంలో రాజ్యసభ ఛైర్మన్ గా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పదవీ విరమణ ఖాయం కావటంతో విపక్ష సభ్యులు సైతం వెంకయ్య ఛలోక్తులు..ఆయనతో సభలో కలిసి కొనసాగే అవకాశం కోల్పోవటం పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్టులోనే సీజేఐ సైతం
ఇక, సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగి తొలి తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణ. జర్నలిస్టుగా పని చేసిన ఆయన..ఫిబ్రవరి 10,1983 లో న్యాయవాదిగా ఎన్ రోల్ చేసుకున్నారు. ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా అనేక రాష్ట్ర - కేంద్ర ట్రిబ్యునల్స్ తరపున వాదనలు చేసారు. న్యాయవాదిగా - న్యాయమూర్తిగా అనేక కీలక అంశాల పైన తన పట్టు నిరూపించుకున్నారు. ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి హోదా దక్కిన తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తరువాత 2014లో సుప్రీం న్యాయమూర్తి అయ్యారు. 2021, ఏప్రిల్ 24న సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. న్యాయవ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తెలుగు భాష పైన మమకారం ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ..తన ఇంటి వద్ద నేమ్ బోర్డు సైతం తెలుగులోనే ఏర్పాటు చేసారు.

మరోసారి తెలుగు వారికి ఛాన్స్ దక్కేనా
తెలుగు భాష కు సంబంధించిన సెమినార్లు.. సమీక్షల్లో ఆయన ఆసక్తిగా పొల్గొనే వారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో తెలుగు రాష్ట్రాలకు ఆయన వచ్చిన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఘనంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఇక, సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఆయన భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు.
రేపు నూతన రాష్ట్రపతిగా ముర్ముతో సీజేఐ ఎన్వీ రమణ ప్రమాణం చేయించనున్నారు. ఆగస్టు 26న సీజేఐగా ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. ఇలా.. ఇద్దరు తెలుగు ప్రముఖులు ఒకే నెలలో పదవీ విరమణ చేయటం.. తిరిగి ఈ స్థానాల్లో తెలుగు వారికి అవకాశం దక్కుతుందా.. ఎప్పటికి మరో సారి అటువంటి అవకాశం ఉంటుందనే చర్చ మొదలైంది. ఇద్దరవీ భిన్నమైన రంగాలైనా.. తెలుగు ప్రజలతో మాత్రం సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ ఇప్పుడు రాజ్యంగా బద్దమైన పదవుల నుంచి రిటైర్ అవుతుండటంతో..ఆ ఇద్దరు తమ రంగాల్లో అందించిన సేవల పైన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications