TTD: సప్త వాహనాలపై శ్రీవారు - రధసప్తమి శోభ, భారీగా భక్తులు..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు మొదలయ్యాయి. సప్త వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనుండడంతో అందుకు తగ్గట్టు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. అరసవల్లిలో రధసప్తమి తొలి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇటు తిరుమలలో స్వామి వారి సూర్యప్రభ వాహన సేవ వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ రోజు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
రథసప్తమి వేడకలు: తిరుమలలో రధసప్తమి వేడుకలు భారీ భక్త జనం మధ్య ప్రారంభించారు. శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేపు చేసారు. విశేష సమర్పణ చేపట్టారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ మొదలైంది. అక్కడినుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలికిరణాలు శ్రీ మలయప్పస్వామివారి పాదాలను స్పర్శిస్తాయి.

ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేస్తుంది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందు తున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయనే నమ్మకం.
సప్త వాహనాలపై శ్రీవారు: ఆ తరువాత శ్రీవారి చిన్నశేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్రస్నానం, కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం..రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చందప్రభ వాహనం పైన శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి.
భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. రధసప్తమి తిరుమలలో మినీ బ్రహ్మోత్సవంగా భావిస్తారు. శ్రీవారి వాహన సేవ ప్రత్యక్షంగా తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు రాత్రికే గ్యాలరీలకు చేరుకున్నారు. వారికి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
అరసవల్లిలో తొలి పూజ: అరసవల్లిలో తొలి పూజా కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్వామి వారిని దర్శించుకున్నారు.
మూల విరాట్ కు ఉదయం 7 గంటలకు వరకు మహాక్షీరాభిషేకం నిర్వహించనున్నారు. స్వామి వారి దర్శనం కోసం గురువారం రాత్రి నుంచే భక్తులు భారీ ఎత్తున అరసవల్లికి చేరుకున్నారు. రధసప్తమిని సూర్య భగవానుడి జన్మించిన సుదినం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో రధసప్తమి వేడుకలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications