అన్యమతస్తులు సినిమా చూడొచ్చా- ఆదిపురుష్‌పై సెటైర్లు
తిరుపతి: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న సినిమా- ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ఇది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే నటించారు. రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ఇదే.
ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అభిమానులను పలకరించబోతోంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమాను టీ- సిరీస్ నిర్మించింది. ఓం రౌత్ దర్శకుడు.

ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే అన్ని థియేటర్లల్లో కూడా ఒక సీట్‌ను ఖాళీగా ఉంచాలని చిత్రం యూనిట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీన్ని ప్రముఖ హేతువాది బాబు గోగినేని తప్పుపట్టారు. సెటైర్లు సంధించారు. సూటి ప్రశ్నలు వేశారు. సినిమా హాల్‌ను గుడిగా మార్చడానికి పర్మిషన్ ఉందా? అక్కడ భక్తులకు కొబ్బరికాయలు కొట్టే సదుపాయం ఏర్పాటు చేశారా? అంటూ ప్రశ్నించారు.
థియేటర్లు గనక గుడిగా మారితే, భక్తులు పూజలు చేసుకోవడానికి కంచు గంటలూ, భక్తులు ఆశీర్వాదం పొందడానికి ఒక దేశీ ఆవూ, సరైన కులం నుంచి ఒక పూజారీ, హల్‌లో నిత్యాన్నదానం కోసం హుండీలూ ఉండాలి కదా? అంటూ సెటైర్లు వేశారు. పరమతస్తులు సినిమా చూడాలంటే టిక్కెట్ కొనే ముందు రిజిస్టర లో సంతకం పెట్టాలి కదా? అలాంటి రిజిస్టర్లను ఏర్పాటు చేశారా? అని అడిగారు.
థియేటర్‌లో అప్రాచ్యపు యురోపియన్ల చిప్స్, మెక్సికన్ల పాప్‌కార్న్, అమెరికన్ల బర్గర్లు, కోకులను అమ్ముకునే వెసలుబాటు ఉందా అని ప్రశ్నించారు. వాటిని విక్రయించేవారి మతాలు, కులాలు తెలుసుకున్నారా? అని నిలదీశారు. నిర్మాతలు ప్రసాదం ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలి కదా? అలాంటి పనులు ఏమైనా చేస్తున్నారా? అని బాబు గోగినేని ప్రశ్నించారు.

బహిష్టులో ఉన్న ఆడవారు, బ్రహ్మచారులు ఉన్న సినిమా హాల్ లోకి, లేక సినిమా ప్రదర్శిస్తున్న గుడులలోకి ప్రవేశించవచ్చునా? అంటూ సెటైర్లు వేశారు. నియమం ప్రకారం మగవాళ్ళు చొక్కా లేకుండా, ఎవరు కూడా లోనికి తోలు వస్తువులు తీసుకురాకుండా, తోలు బెల్టులు లాంటివి ధరించకుండా, చెప్పులు లేకుండా లోనికి వెళ్ళాలి కదా? అని గుర్తు చేశారు.
రాహు కాలంలో షో ఉంటే ఏమి చేయాలని, హాలు వాస్తు ప్రకారం లేకపోతే దీనికి రెమెడీ ఎవరు ఇవ్వాలని ప్రశ్నించారు బాబు గోగినేని. తూర్పుకు దండం పెట్టుకోవాలంటే, లేదూ సేతువు ఎటు వైపు ఉందో చూపించే దిక్సూచి ప్రతి హాల్‌లో కూడా ఉంటుందా? అని చిత్రం యూనిట్‌ను అడిగారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ను షేర్ చేశారాయన.












Click it and Unblock the Notifications