విభజనపై యుద్ధమే: కిరణ్ రెడ్డి వ్యూహం ఇదే
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులతో, ప్రజాప్రతినిధులతో చర్చించారు. శాసనసభలో విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. విభజనకు వ్యతిరేకంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల సీమాంధ్ర శాసనసభ్యులను కలుపుకుని పోరాటం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కలుపుకుని వచ్చే బాధ్యతలను కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు మంత్రులకు అప్పగించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్‌లకు ఆ బాధ్యతను అప్పగించారు. విభజనకు వ్యతిరేకంగా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తామని సిఎం సమావేశంలో చెప్పారు. ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేయాలని చెప్పారు. పార్లమెంటుకు బిల్లు వచ్చిన వెంటనే న్యాయపోరాటం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు తీసుకుంటామని మంత్రి శైలజానాథ్ సమావేశానంతరం చెప్పారు. బిల్లుపై ఓటింగు కోరుతామని ఆయన చెప్పారు న్యాయపోరాటం ద్వారానే తెలంగాణను అడ్డుకోలగమని సి. రామచంద్రయ్య అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అన్ని మార్గాలనూ వెతుకుతున్నామని రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. అసెంబ్లీలో బిల్లును ఓడించడం అందులో ఒకటని ఆయన చెప్పారు.
వ్యక్తిగతంగా న్యాయస్థానాల్లో విభజనను సవాల్ చేస్తారని ఆయన చెప్పారు. అసెంబ్లీని రద్దు చేస్తే ఫలితం ఉంటుందో చూడాలని సూచించినట్లు ఆయన తెలిపారు. తాము యుద్ధభూమిలో ఉన్నామని, ముందు నుంచి పొడుస్తామా వెనక నుంచి పొడుస్తామా అనేది ముఖ్యం కాదని, విజయం ముఖ్యమని ఆయన అన్నారు. విభజనకు వ్యతిరేకంగా అన్ని విధాలుగా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మిగతా పార్టీల శాసనసభ్యులను కలుపుకుని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రటనను అడ్డుకున్నట్లే ఇప్పుడు అడ్డుకుంటామని ఆయన చెప్పారు. అలాగే విజయం కూడా సాధిస్తామని ఆయన అన్నారు. తమది గాంధీ మార్గమేనని ఆయన చెప్పారు. శాసనసభ్యులంతా ఒకే గొంతు వినిపించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications