కామెంట్స్ ఎఫెక్ట్: చంద్రబాబును ఆకాశానికెత్తిన రాయపాటి
చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు వచ్చిన వార్తలను రాయపాటి ఖండించారు. అదే సమయంలో చంద్రబాబును ఆకాశానికెత్తారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడిన తెలుగుదేశంం పార్టీ పార్లమెంటు సభ్యుడు వెనక్కి తగ్గారు. ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ రాయపాటి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని రాయపాటి కొట్టిపారేశారు.
అదే సమయంలో చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని ఆయన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబుకు తాను వ్యతిరేకంగా మాట్లాడినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

చంద్రబాబు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. సీఎంగా మరో 20 ఏళ్లు చంద్రబాబే కొనసాగుతారన్నారు. రాష్ట్రంలో, దేశంలో తిరుగులేని నాయకుడు చంద్రబాబేనని అన్నారు.
ఐదు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో చంద్రబాబు లాంటి ప్రజానాయకుడు కనిపించలేదని అన్నారు. పోలవరానికి జాతీయ హోదా, ప్యాకేజీ, నదుల అనుసంధానం చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే సాధ్యమైందని చెప్పారు. మూడేళ్ల వ్యవధిలోనే ఏపీకి రాజధానిని తరలించి, ఇక్కడ నుంచే పాలించడం ఆయన సమర్థతకు నిదర్శనమని కొనియాడారు. గత ముఖ్యమంత్రులు సొంత పనుల కోసం ఢిల్లీకి వస్తే చంద్రబాబు మాత్రం రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి వెళ్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications