ఓటుకు నోటు కేసు: చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఓటుకు నోటు కేసులో హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై 8వారాలపాటు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
వివరంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. కింది కోర్టు ఉత్తర్వులపై మెమో ఎలా దాఖలు చేస్తారని హైకోర్టు.. ఏసీబీ కోర్టును ప్రశ్నించింది. అలాగే, ఎఫ్ఐఆర్ అవసరం లేదని మీరేలా చెబుతారని ప్రశ్నించింది. ఛార్జీషీటు దాఖలు చేసిన తర్వాత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తారని పిటిషనర్ రామకృష్ణను కోర్టు ప్రశ్నించింది.

కాగా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని మంగళగిరి వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టు చంద్రబాబును విచారించాలని తీర్పునివ్వడంతో... సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఓటుకు నోటు కేసుతో రామకృష్ణారెడ్డికి సంబంధమేమీ లేదని, రాజకీయ దురుద్దేశ్యాలతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని, దీంతో సదరు పిటిషన్ ను కొట్టేయాలని చంద్రబాబు బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
దీంతో శుక్రవారం ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. కాగా, చంద్రబాబు తరుపున ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. గతంలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ కోసం కూడా లూథ్రానే వాదించడం గమనార్హం.
కాగా, ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టూ అడ్డుకోలేదని, ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని సుధాకర్ రెడ్డి వాదించారు. కాగా, ఆయన వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది.
ఏసీబీ కోర్టు మెమో ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. సెక్షన్ 156 ఆర్డర్‌పై స్టే అడిగే హక్కు పిటిషనర్‌కు లేదని సుధాకర్ రెడ్డి చెప్పగా.. ఆయన వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.
సుప్రీంకోర్టుకు వెళ్తా: ఆర్కే
హైకోర్టు ఆదేశాలపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి తెలిపారు. చంద్రబాబు స్వరనమూనాలను వివిధ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లలో పరీక్షలకు పంపి, ఆ నివేదికల ఆధారంగానే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications