పోసాని కృష్ణమురళికి హైకోర్టులో రిలీఫ్..ఆ కేసుల్లో నో యాక్షన్ ..!
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో వరుస కేసులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. ఇప్పటికే వరుస కేసులు, కస్టడీలు, పీటీ వారెంట్లు, జైలు జీవితంతో నలుగుతున్న పోసాని ఊరట కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
పోసాని కృష్ణమురళిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలోనే రాష్ట్రవ్యాప్తంగా 30 ఫిర్యాదులతో 16 కేసులు నమోదయ్యాయి. వీటిలో అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో పోసానిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రిమాండ్ పై రాజంపేట జైల్లో ఉంచారు. అనంతరం నరసరావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేసి పీటీ వారెంట్ పై తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు ఇలాంటి మరో కేసులో పోసానిని అరెస్టు చేసి పీటీ వారెంట్ పై కోర్టులో హాజరుపర్చారు. దీంతో పోసానిని ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉంచారు. ఈ నేపథ్యంలో పోసాని తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పోసాని పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయనపై విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది. అయితే మిగతా జిల్లాల్లో కేసులు మాత్రం కొనసాగనున్నాయి. పోసాని పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఆ లోపు పోలీసులు సమర్పించే వివరాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరోవైపు ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఉన్న పోసాని కోసం మరో రెండు జిల్లాల పోలీసులు పీటీ వారెంట్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ కేసుల్లోనూ పోసాని అరెస్టు, రిమాండ్ తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications