అన్నను చూపించండి: రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి, నోరు మెదపని స్టీఫెన్
హైదరాబాద్: తన అన్నను చూపించాలంటూ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. తన సోదరుడికి ప్రభుత్వం నుంచి ప్రాణ హాని ఉందని, ఆయనను తమకు చూపించాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి అరెస్ట్ వార్త తెలుసుకున్న కొండల్ రెడ్డి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. తన అన్న ఉదయం నుంచి కనిపించలేదని, ఆయనను ఒక్కసారి చూపించాలని డిమాండ్ చేశారు. ఇతరులకు డబ్బులిచ్చేంతగా తమ దగ్గర డబ్బులు లేవని, అవి ప్రభుత్వం పెట్టిన డబ్బులేనని కొండల్ రెడ్డి ఆరోపించారు.

రేవంత్ తన స్నేహితుడికి ఇంటికి మాత్రమే వెళ్లాడని, స్టీఫెన్ ఇంటికి కాదని చెప్పారు. అరెస్ట్ సమయంలో ఏసీబీ అధికారులు రేవంత్‌ను లాక్కుని వెళ్లి వాహనంలో పడేశారని, దీంతో ఆయన చేతికి గాయమైందని, తనను తక్షణమే చూడాలని కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే రేవంత్‌పై అక్రమ కేసులు బనాయించారని, ఆయనకు ప్రభుత్వం నుంచి ప్రాణహానీ ఉందని ఆరోపించారు.
కాగా, రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్ మాట్లాడడానికి నిరాకరించారు. ఆయనను మీడియా పలకరించడానికి ప్రయత్నించినప్పుడు మాట్లాడబోనంటూ సైగ చేస్తూ కారులో వెళ్లిపోతున్న దృశ్యాలను టీవీ న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి.












Click it and Unblock the Notifications