మెదక్: కెసిఆర్ మెజార్టీయే, రెండింట పోటీ ప్రతికూలమా
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తన సొంత గడ్డ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంత మెజార్టీ వస్తుందనే చర్చ సాగుతోంది. మెదక్ పార్లమెంటుకు తెరాస నుండి కెసిఆఱ్, బిజెపి నుండి నరేంద్ర నాథ్, కాంగ్రెసు పార్టీ నుండి శ్రవణ్ కుమార్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. కెసిఆర్ విజయం ఖాయమని, అత్యధిక మెజార్టీ వస్తుందని, ఆ మెజార్టీ ఎంత అనేదే తేలాల్సి ఉందని తెరాస క్యాడర్ అంటోంది.
తన వల్లే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ చెబుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా కెసిఆర్ ప్రచారం చేయాల్సి ఉన్నందున.. ఆయన గెలుపు బాధ్యతను అల్లుడు హరీష్ రావు తీసుకున్నారు. తెలంగాణ తెచ్చామని తెరాస, ఇచ్చామని కాంగ్రెసు, మద్దతిచ్చామని బిజెపి చెబుతూ పోటీ పడుతున్నాయి. మెదక్ లోకసభ పరిధిలోని సిద్దిపేట అసెంబ్లీ నుంచి గతంలో ఆరుసార్లు ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా పని చేసిన కెసిఆర్.. ప్రత్యేక రాష్ట్ర సాధనతో గట్టి పట్టు సాధించారు.
బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేంద్రనాథ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, అప్పటి తెరాస అభ్యర్థి విజయశాంతి చేతిలో కేవలం ఆరువేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకుముందు, ఆ తర్వాత కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోనే ఉన్నారు. ఈసారి ఆయన కెసిఆర్‌తోనే ఢీకొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, బిసిలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్రనాథ్‌కు.. టిడిపి శ్రేణుల సహకారమే సవాల్‌గా మారింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా కొత్త. అయినా, పార్టీ నాయకుల సలహాలతో దూసుకెళ్తున్నారు.

సాధ్యమైనంత ఎక్కువ మెజారిటీ సాధించేందుకు తెరాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి బలం ఉంది. గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతర పార్టీలదే పైచేయి అని, ఇక్కడ తెరాస బలహీనంగా ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే, బలం అంతంతమాత్రంగా ఉన్న గజ్వేల్ సెగ్మెంట్‌లో స్వయంగా ఆయనే బరిలో ఉండడం ప్లస్ పాయింట్.
నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు సెగ్మెంట్లలో ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులను పార్టీలో చేర్చుకుని ఆయా సెగ్మెంట్లలో బలం పుంజుకున్నారు. వీటన్నిటికీ తోడు తెరాసకు కంచుకోటగా ఉన్న సిద్దిపేట సెగ్మెంట్‌లో గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి హరీశ్ రావు 95 వేలపై చిలుకు రికార్డు స్థాయి మెజార్టీ సాధించారు. ఇప్పుడు ఆయన టార్గెట్ లక్ష దిశగా ముందుకు వెళుతున్నారు. ఇది కూడా కెసిఆర్‌కు ఒక అనుకూల అంశంగా భావిస్తున్నారు.
వాస్తవానికి, గత ఎన్నికల్లో లోకసభ పరిధిలోని ఒక్క సిద్దిపేట సెగ్మెంట్‌లోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈసారి దానితోపాటు మిగిలిన ఆరు సెగ్మెంట్లలోనూ పార్టీకి, తనకు విజయం దక్కాలన్న ఆకాంక్షతో బరిలోకి దిగారు. అయితే, ఇదే జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోకసభ స్థానాల్లో బరిలోకి దిగిన కెసిఆర్ గెలిచిన తర్వాత ఏదో ఒక దానిని వదులుకోవడం ఖాయం. ఈ అంశం కెసిఆర్‌కు కొంత ప్రతికూలమే.
కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ రాజకీయాలకు పూర్తిగా కొత్త. లోకసభ పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ సిట్టింగులు ఉండడం సానుకూలాంశం. అయితే పటాన్‌చెరు, గజ్వేల్, దుబ్బాక సెగ్మెంట్లలో అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు ప్రతికూలం. అసంతృప్తివాదులను బుజ్జగించి గ్రూపుల్లేకుండా కలిసికట్టుగా సాగేలా శ్రవణ్ ప్రయత్నిస్తున్నారు. ఏ మేరకు సహకరిస్తారనేది చూడాలి. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన కొంత వ్యతిరేకత ఉంది.
గత ఎన్నికల్లో ఓడినా నరేంద్రనాథ్ ఈ లోకసభ పరిధిలోని ప్రజలకు తన నరేన్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆరోగ్య శిబిరాలు, ఉచిత మందుల పంపిణీ, పేదలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించడం ద్వారా ప్రజల్లోనే ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన ఈసారి ఎన్నికలకు ముందు బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తన సేవాభావానికి నరేంద్ర మోడీ హవా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.
సొంత పార్టీలోనే నర్సాపూర్, పటాన్‌చెరు సెగ్మెంట్లలోని శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు పొత్తులో భాగంగా సంగారెడ్డి, సిద్దిపేట స్థానాలను బిజెపికి ఇవ్వడాన్ని నిరసిస్తూ టిడిపి నాయకులు అధిక సంఖ్యలో పార్టీకి రాజీనామా చేసి కొందరు కాంగ్రెస్‌లో, ఇంకొందరు తెరాసలో చేరారు.












Click it and Unblock the Notifications