మమ్మల్ని నలిపేస్తోన్నారు.. మే అరుస్తున్నామా?- ఆ క్రిటికల్ సీట్లల్లో కూటమిలో డేంజర్ బెల్స్
Telugu Desam Party and Janasena: రెండో ఏడాదికే..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు కనిపిస్తోన్నాయి. సర్దుబాటు గొడవలు ఇప్పుడిప్పుడే బీజం వేసుకుంటోందనే అంచనాలు ఉన్నాయి.
రెండు నెలల కిందట తొలి వార్షికోత్సవాన్ని జరుపుకొంది టీడీపీ కూటమి ప్రభుత్వం. తొలి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 12వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇతర మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు.

రోజులు గడుస్తున్న కొద్దీ కూటమిలో లుకలుకలు నెలకొంటోన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. జనసేన శాసన సభ్యులు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాలతో పాటు, ఆ పార్టీ బలంగా ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీ పెత్తనం, ఆధిపత్య ధోరణి అధికమౌతూ వస్తోందని చెబుతున్నారు.
దీని తీవ్రత- ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది బయటపడుతున్నప్పటికీ పార్టీ అగ్రనాయకత్వం పెద్దగా పట్టించుకోవట్లేదని జనసేన క్యాడర్ అంతర్మథనానికి గురవుతోందని అంటున్నారు. సొంత పార్టీలో టీడీపీ వ్యతిరేక గళాన్ని వినడానికి జనసేన అగ్రనాయకులు సిద్ధంగా లేరని చెబుతున్నారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల, విశాఖపట్నం దక్షిణం, అనకాపల్లి జిల్లా యలమంచిలి వంటి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీల పెత్తనంతో.. జనసేన నలిగిపోతోందని రైజ్ సర్వే సంస్థ చీఫ్ ప్రవీణ్ పుల్లట వెల్లడించారు. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని, వారిని వేదన.. అరణ్యరోదనే అవుతోందని పేర్కొన్నారు.
ఈ మూడు నియోజకవర్గాలపై కూడా జనసేన జెండా ఎగురుతోంది. నెల్లిమర్ల- లోకం మాధవి, విశాఖ దక్షిణం- చెన్నుబోయిన వంశీ కృష్ణ శ్రీనివాస్, యలమంచిలి- సుందరాపు విజయ్ కుమార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
గతంలో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న విశాఖపట్నంలో టీడీపీ క్యాడర్ కు వ్యతిరేకంగా జనసేన నాయకుడు మాట్లాడుతుండగా.. నాగబాబు మైక్ కట్ చేయించిన ఉదంతాన్ని దీనికి ఉదాహరణగా తీసుకుంటోన్నారు.
టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని జనసేన తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోంది. పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం, కార్యకలాపాలను నిర్వహించడంపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తోంది. ఇటువంటి కార్యకలాపాలు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని పేర్కొంటోంది. దీన్ని టీడీపీ తనకు అనుకూలంగా మలచుకుంటోందనే వాదనలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications