అబద్ధాలతోనే బతుకు: చంద్రబాబుపై రోజా, తననే అడగాలన్న లక్ష్మీపార్వతి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర మహిళలను మోసం చేయడానికి ప్రయత్నించారని, ఆయన 60 వేల అబద్ధాలతో బతుకు గడుపుతున్నారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమర దీక్ష రెండో రోజు సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తనకు ఓటేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని, కుదువలో ఉన్న తాళిబొట్లు ఇంటికి వస్తాయని ఎన్నికల ముందు బాబు ఊదరగొట్టారని ధ్వజమెత్తారు. కానీ, ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేసి ఉన్న ముక్కుపుడకలు, కమ్మలు కూడా కుదువ పెట్టేలా చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఆయన 60 వేల అబద్ధాలతో తమ జీవితాలు నాశనం చేశారని మహిళలు ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు.
డ్వాక్రా గ్రూపులు తానే ప్రారంభించానని చెప్పుకొనే చంద్రబాబు.. పాము తన గుడ్లు తానే తినేసినట్లు డ్వాక్రా గ్రూపులను సర్వనాశనం చేశారని రోజా మండిపడ్డారు. మహిళలు పొదుపు చేసుకున్న డబ్బు కూడా వడ్డీలకే కట్టేలా చేస్తున్నారని ఆమె తెలిపారు.
అల్లుడి గురించే నన్నే అడగాలి: లక్ష్మీ పార్వతి

తన అల్లుడి ఘన చరిత్ర తెలియాలంటే.. అత్తనే అడగాలని వైయస్సార్ కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీపార్వతి సెటైర్లు విసిరారు. చంద్రబాబునాయుడికి సంబంధించిన పలు రహస్యాలను 'సమర దీక్ష' వేదికగా ఆమె బయటపెట్టారు. బాల్యంలో చంద్రబాబు ఘనకార్యాలను తల్లి గానీ, టీచర్లు గానీ అడ్డుకుని ఉంటే.. ఇప్పుడు రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం పట్టి ఉండేది కాదని అన్నారు.
ఒకటో తరగతిలో ఉండగానే పక్కన పిల్లాడి దగ్గర బలపం కొట్టేశాడని, అప్పుడు వాళ్ల టీచర్ కొట్టారని ఆమె తెలిపారు. రూ. 10 లక్షలు తీసుకుని ఎన్టీ రామారావు కూతురిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడని ఆమె చెప్పారు. కేజీ బేసిన్‌లో ఓఎన్జీసీ ద్వారా గ్యాస్ నిక్షేపాలు బయటపడినప్పుడు రిలయన్స్‌తో చంద్రబాబు 34 వేల కోట్ల ఒప్పందం చేసుకున్నాడని లక్ష్మీపార్వతి వెల్లడించారు.
‘ఏమైనా అల్లుడి చరిత్ర అత్తకే కదా తెలిసేది' అంటూ లక్ష్మీ పార్వతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమర దీక్ష రెండో రోజు సమావేశంలో అన్నారు. మనవడైనా గట్టివాడు ఉంటాడేమో అనుకుంటే.. అబ్బిగాడికి అబ్బిగాడే పుడతాడని తేలిందని చెప్పారు. ‘ఒబామాతో ఫొటో దిగడానికి రూ. 6 లక్షలు ఖర్చుపెట్టాడు. మా మనవడు లోకేశ్.. ఒబామాకే స్మార్ట్ సిటీలు ఎలా ఉండాలో చెప్పాడని బిల్డప్పిచ్చారు. తండ్రికి తగ్గ కొడుకే పుట్టాడని అప్పుడు అనుకున్నాను' అని పార్వతి తెలిపారు.












Click it and Unblock the Notifications