జగన్ అలా.. బాబు ఇలా..: బుట్టా రేణుకపై రోజా పవర్ పంచ్‌లు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ బుట్టా రేణుకపై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ బుట్టా రేణుకపై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బుట్టా రేణుక తన అనుచరులను భారీ ఎత్తున టీడీపీలో చేర్పించిన విషయం తెలిసిందే. బుట్టా రేణుక కూడా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించారు.

నీ అభివృద్ధా.. బాబుదా?
ఈ నేపథ్యంలోనే రోజా మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని బుట్టా రేణుక చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘అభివృద్ధి నీకు జరిగిందా? లేక చంద్రబాబుకు జరుగుతున్న అభివృద్ధి నచ్చిందా?'అంటూ ఎద్దేవా చేశారు.

వారు కనిపించలేదు కానీ,.. బాబు పలుకులుఎలా నచ్చాయి..?
రాయలసీమలో చేనేత కార్మికుల సమస్యలను పక్కనపెట్టిన చంద్రబాబు చెప్పే అభివృద్ధి పలుకులు ఎలా నచ్చాయని రోజా ప్రశ్నించారు. తన ఎంపీ నియోజకవర్గం పరిధిలో వర్షాలు వచ్చి పంటలు మునిగిపోయినా బుట్టా రేణుకకు కనిపించలేదని అన్నారు. అయితే, చంద్రబాబునాయుడు, ఆయన క్యాంప్ కార్యాలయం అభివృద్ధి మాత్రం బుట్టా రేణుకకు బాగా కనిపించందని రోజా ఎద్దేవా చేశారు.

ఏ విధంగా మద్దతిచ్చారు?
జీఎస్టీ నుంచి చేనేతను తప్పించాలని 30రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని చంద్రబాబుపై మండిపడ్డారు. కానీ, జగన్ వెళ్లి చేనేత కార్మికులకు మద్దతు తెలిపారని చెప్పారు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పిన టీడీపీకి.. చేనేత కుటుంబంలో పుట్టిన బుట్టా రేణుక ఏ విధంగా మద్దతిచ్చారో, ఎందుకు మద్దతిచ్చారో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.

రేణుకకు హెచ్చరిక
ఓట్లు వేసిన వారిని, పార్టీని అవమానించి ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్న బుట్టా రేణుకకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రోజా హెచ్చరించారు. మంగళవారం చంద్రబాబును కలిసిన బుట్టా రేణుక మాట్లాడుతూ.. సీఎం చేస్తున్న అభివృద్ధి పనులను చూసే తాను టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

చేతకాని సీఎం..
విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకోలేకపోతున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారని, తుఫానుల నుంచి రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నారని చంద్రబాబుపై రోజా తీవ్రంగా విమర్శించారు. అంతేగాక, ఈ చేతకాని ముఖ్యమంత్రిలో ఏం అభివృద్ధి కనిపించిందో.. తనకైతే కనిపించలేదని రోజా విమర్శించారు.

సస్పెండ్ చేయలేదు.. జగన్ అలా.. బాబు ఇలా..
తమ పార్టీ బుట్టా రేణుకను సస్పెండ్ చేయలేదని రోజా చెప్పారు. ఇలా జగన్ మీద బురద జల్లడం పిచ్చితనమే అవుతుందని అన్నారు. 45ఏళ్ల వయస్సున్న జగన్.. నాయకులను తయారు చేస్తున్నారని.. 40ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు మాత్రం నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications