బికినీ షోలకు ఓకె చెప్పి, హోదాకు నో అంటారా: బాబుకు రోజా ప్రశ్న
ప్రత్యేక హోదా విషయంలో రోజా చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బికినీ షోలకు ఓకె చెప్పి హోదాకు నో అంటారా అని అడిగారు.
తిరుపతి: ప్రత్యేక హోదా విషయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు, సినీ నటి రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం బీచ్‌లో బికినీ షోలకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరసన తెలపడానికి అనుమతి ఇవ్వడం లేదని అన్నారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అయితే కమిషన్లు దండుకోవచ్చునని ప్రభుత్వం చూస్తోందని, అందుకే హోదాను కాదని ప్యాకేజీని కోరుకుటోందని ఆమె విమర్శించారు.

ప్రత్యేక హోదాపై యువత చేస్తున్న ఆందోళనకు ఏపీ ప్రభుత్వం అనుమతినివ్వక పోవడంపై ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. బీచ్‌లో బికినీ షోలకు అనుమతినిచ్చే ప్రభుత్వం, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరిగే నిరసన కార్యక్రమానికి ఎందుకు మద్దతివ్వదని రోజా ప్రశ్నించారు.
హోదా వల్లే ఏపీ యువతకు భవిష్యత్ ఉంటుందని, ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై పోరాడకుండా, పోరాడే వారిని అణచివేయాలని చూడటం దారుణమని రోజా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రదేశాల్లో జరిగే నిరసన కార్యక్రమాలకు యువత పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలపాలని ఆమె పిలుపునిచ్చారు. శాంతియుతంగా జరిగే ఆందోళనను అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వానికి గడ్డు కాలం తప్పదని రోజా హెచ్చరించారు.












Click it and Unblock the Notifications