ఓటుకు నోటుకు కేసుతో హోదాపై చంద్రబాబు రాజీ: రోజా
గుంటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. గుంటూరులో జగన్ దీక్షా స్థలాన్ని ఆమె సోమవారంనాడు పరిశీలించిన రోజా మీడియాతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని రోజా చెప్పారు. జగన్ దీక్షా స్థలానికి అనుమతి కోసం రోజా అర్బన్ ఎస్పీని కలిశారు. విద్యార్థులు, యువత భవిష్యత్తు దృష్ట్యా ఈ నెల 26వ తేదీన జగన్ దీక్ష చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తూ కేంద్రం వద్ద సాగిలపడిందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని రోజా చెప్పారు. ఎపికి ప్రత్యేక హోదా వచ్చే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు.
ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26వ తేదీ నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీలోగా ప్రత్యేక హోదా విషయాన్ని తేల్చాలని, లేదంటే 26 నుంచి దీక్ష చేస్తానని ఆయన ఇదివరకే చెప్పారు












Click it and Unblock the Notifications