టిడిపిలోకి వెళ్లడంపై రోజా: ఏుపీలో కృష్ణా పుష్కరాలకు మురుగునీరు
విజయవాడ: తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమని, అదంతా వట్టి ప్రచారమేనని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం నాడు చెప్పారు. ఆమె ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
టిడిపిలోకి తాను ఫిరాయించనున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. కొందరు పని గట్టుకుని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా పుష్కరాలు జరుగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం నదిలోకి మురుగు నీటిని వదులుతోందన్నారు.

దీని వల్ల వచ్చే రోగాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ సర్కారు భక్తులకు సరైన వసతులు కల్పించడంలో మరోసారి విఫలమైందన్నారు. కనీసం యాత్రికులకు మంచినీరు కూడా ఇవ్వకుండా స్నానాలకు మురుగునీరు ఇవ్వడం బాధాకరం అన్నారు.
కృష్ణా పుష్కరాలపై భక్తులకు చంద్రబాబు
కృష్ణ పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భక్తులు సహకరించాల్సిందిగా ఆయన ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా తన దృట్టికి తీసుకురావాని కోరారు. ప్రాధాన్యత క్రమంలో అన్నీ ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు.
పుష్కరాల్లో కానిస్టేబుల్ మృతి పట్ల చంద్రబాబు ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. అది రోడ్డు ప్రమాద ఘటన అని, ఇక అలాంటివి జరగబోవన్నారు. భక్తులు సహకరించాలని కోరారు. పుష్కరాలకు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. చిన్న చిన్న సమస్యలు సహజమని వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే అప్పటికప్పుడే పరిష్కరిస్తామన్నారు.












Click it and Unblock the Notifications