రోజా సస్పెన్షన్‌పై దద్ధరిల్లిన అసెంబ్లీ: యనమల వర్సెస్ జగన్
హైదరాబాద్: తిరిగి సమావేశమైన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పరిస్థితి మారలేదు. వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌పై తిరిగి సభలో గందరగోళం చెలరేగింది. మంత్రి యనమల రామకృష్ణుడికి, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యనే స్పీకర్ కోడెల శివప్రసాద రావు బిల్లులను ప్రతిపాదించాలని మంత్రులకు సూచించారు.
యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు బిల్లులను ప్రతిపాదించే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు తీవ్ర అలజడి సృష్టించారు. దీంతో సభను స్పీకర్ మరోసారి వాయిదా వేశారు. సభను 15 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు. అంతకు ముందు సభ తిరిగి సభ సమావేశం కాగానే - రోజాపై సస్పెన్షన్ ఎత్తేయాలని జగన్ పట్టుబట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా మహిళా సభ్యురాలిని సస్పెండ్ చేశారని, ఇది తప్పుడు సంప్రదాయానికి తెర తీస్తుందని జగన్ అన్నారు.

రోజాపై సస్పెన్షన్‌ను ఎత్తేయకపోతే సభను జరగనివ్వబోమని, తామంతా సస్పెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ చెప్పారు. దీనికి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ - జగన్ సభను బెదిరించలేరని, రోజాను సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకుందని, సభనే సుప్రీం అని, అందువల్ల రోజా సస్పెన్షన్‌ను ప్రశ్నించడానికి వీలు లేదని అన్నారు.
మీరు సస్పెండ్ అవుతామంటే సంతోషంగా సస్పెండ్ చేస్తామని యనమల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను ఉద్దేశించి అన్నారు. సభ నడవడానికి సహకరించాలని, అస్తమానం జగన్ పుస్తకం చూపించి నియమనిబంధనల గురించి మాట్లాడుతున్నారని, అవెలా ఉన్నా సభనే సుప్రీం అని ఆయన అన్నారు.
సస్పెండ్ అయిన ఎమ్మెల్యే శాసనసభ ఆవరణలోకి రావడానికి వీలు కాదని, సెన్సేషన్ కోసం అలా చేయడం సరి కాదని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. సభ జరగకుండా చేయడానికి ఏం చేయాలో అది చేస్తున్నారని, మొదటి రోజు అంబేడ్కర్‌ను ముందు పెట్టారని, ఈ రోజు రోజా సస్పెన్షన్‌పై తాము పట్టుబడుతాం కాబట్టి సభ జరగదని వారికి తెలుసునని, సభ జరగకుండా చేయడానికి ఇలా చేస్తున్నారని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications