RBI: వడ్డీ రేట్లపై కీలక ప్రకటన. లోన్ ఉన్నవారికి అలర్ట్!
దేశీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన పరపతి విధాన సమీక్షలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రధాన రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దాంతో పాటు తన విధానపరమైన వైఖరిని 'తటస్థం'గానే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది.
ధరల పెరుగుదల క్రమంగా అదుపులోకి రావడం, దేశీయంగా ఆర్థిక ప్రగతి వేగంగా ముందుకు సాగుతుండటంతో వడ్డీ రేట్లను పెంచాల్సిన లేదా తగ్గించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భావించింది. ఈ నిర్ణయంతో హోం లోన్, వెహికిల్ లోన్ తీసుకున్న వారిపై కొత్తగా ఎలాంటి ఈఎంఐ భారం పడకుండా ఉపశమనం లభించింది.

అంచనాలను మించిన ఆర్థిక పురోగతి
గతంలో ఆర్బీఐ వేసుకున్న లెక్కల కంటే దేశ ఆర్థిక సూచీలు ఎంతో మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ముఖ్యంగా రిటైల్ ద్రవ్యోల్బణం అనూహ్యంగా తగ్గడం కలసివచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సగటు ద్రవ్యోల్బణం 4.2 శాతంగా ఉంటుందని భావించగా, అది 3.9 శాతానికే పరిమితమైంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడం మన దేశానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 95 డాలర్లు ఉంటుందని అంచనా వేస్తే, ప్రస్తుతం అది 85 నుంచి 87 డాలర్ల శ్రేణిలోనే లభిస్తోంది. ఇక దేశీ జీడీపీ వృద్ధి రేటు కూడా 6.6 శాతం అంచనాలను దాటుకుని ఏకంగా 7 శాతానికి సమీపిస్తుండటం ఆర్థిక స్థిరత్వానికి అద్దం పడుతోంది.
విదేశీ నిధుల వెల్లువ.. విదేశీ మారక నిల్వల రికార్డు
విదేశీ కరెన్సీని ఆకట్టుకునేందుకు ఆర్బీఐ చేపట్టిన ప్రత్యేక చర్యలు ఆశించిన దానికంటే అద్భుతమైన ఫలితాలను అందించాయి. విదేశీ డిపాజిట్లు, విదేశీ వాణిజ్య రుణాలుద్వారా ఇప్పటివరకు ఏకంగా 40.82 బిలియన్ డాలర్ల నిధులు భారత్‌కు వచ్చాయి. ఇది 2013 నాటి రికార్డుల కంటే చాలా ఎక్కువ కావడం విశేషం. ఈ అవకాశం సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉన్నందున మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముంది. మరోవైపు ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులు దాదాపు రూ. 3.75 లక్షల కోట్లకు చేరడం భారత్ పట్ల అంతర్జాతీయ ముదుపరుల నమ్మకాన్ని తెలియజేస్తోంది.
దేశానికి కొండంత అండగా ఫారెక్స్ రిజర్వులు
అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు, చమురు ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు గట్టి పోటీని తట్టుకుని నిలబడ్డాయి. జూలై ఆఖరు నాటికి దేశీయ ఫారెక్స్ నిల్వలు ఏకంగా 682.35 బిలియన్ డాలర్ల ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం మన దగ్గరున్న ఈ విదేశీ మారక నిల్వలు దాదాపు 11 నెలల పాటు విదేశీ దిగుమతులకు సరిపోవడమే కాకుండా, మన దేశ మొత్తం విదేశీ అప్పుల్లో 89 శాతాన్ని చెల్లించగల సామర్థ్యాన్ని ఇస్తున్నాయి. బలమైన ఆర్థిక పునాదులు, తగ్గుతున్న ధరల భారం వెరసి ఆర్బీఐని వడ్డీ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించేలా చేశాయి.













Click it and Unblock the Notifications