రూ.2000 నోట్ల మార్పిడి.. ఈ విషయాలు తెలుసా?
రూ.2,000 నోట్ల (Rs.2,000 Notes) మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని, దీన్ని 2016 నాటి నోట్ల రద్దుతో పోల్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్ బీఐ అంచనా ప్రకారం రద్దు సమయంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లతో పోలిస్తే.. ప్రస్తుతం రూ.2,000 నోట్ల వాటా చాలా తక్కువ.
నోట్ల వాటా కేవలం 10.8 శాతం : మార్చి 31వ తేదీకి చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా కేవలం 10.8 శాతం. నోట్ల రద్దు తర్వాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లుబాటవలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం రూ.2,000 నోట్లు చెల్లుతాయని ఆర్బీఐ చెబుతోంది. ఎలాంటి లావాదేవీకైనా ఈ నోటును ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. సెప్టెంబరు 30వ తేదీ తర్వాత రూ.2000 నోటు చెల్లుబాటవదని ఇంతవరకు ఆర్బీఐ వెల్లడించలేదు. తమ దగ్గరున్న నోట్లను మార్చుకోవడానికి ప్రజలవద్ద కావల్సినంత సమయం ఉంది.

మార్చుకోవాలా? డిపాజిట్ చేయాలా : రూ.2000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో వాటిని మార్చుకోవాలా? లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలా? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. ఉన్న డబ్బుకు సరైన పత్రాలు, ఆధారాలుంటే డిపాజిట్ చేసుకోవడమే మేలు. ఒకసారి 10 నోట్లను మాత్రమే మార్చుకోవాలనే నిబంధన కేవలం నోట్ల మార్పిడికి మాత్రమే వర్తిస్తుందని, డిపాజిట్ విషయంలో ఈ నిబంధన అమలు కాదని, ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఖాతా లేకపోతే మార్చుకోవడమే : బ్యాంకు ఖాతా లేనివారికి మాత్రం నోట్లు మార్చుకోవడం తప్ప మరే ఆప్షన్ లేదంటున్నారు. ఒకరోజులో ఎంత మార్చుకోవాలనేదానిపై ఆర్‌బీఐ ఎలాంటి పరిమితి విధించలేదు. ఒక్క లావాదేవీలో 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు వీలుంది. అలా ఎన్నిసార్లైనా లైన్‌లో నిలబడి నోట్లను మార్చుకోవచ్చు. బ్యాంకును బట్టి సాధారణంగా వీటిపై పరిమితి విధించే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications