రాజీనామా చేసినా ఎన్డీయేలోనే: జగన్‌ను దెబ్బకొట్టేందుకు బాబు రాజ్యసభ ప్లాన్
అమరావతి: కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగిన ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి మాత్రం వైగొలగలేదు. బడ్జెట్ సమావేశాల వరకు వేచి చూసి ఆ తర్వాత వైదొలుగుతారని అంటున్నారు.
అయితే, ఎన్డీయే నుంచి వైగొలగకపోవడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. అది రాజ్యసభ ఎన్నికలు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం టీడీపీకి రెండు, వైసీపీకి ఒకటి వస్తుంది.

23న రాజ్యసభ ఎన్నికలు
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను టీడీపీ తమ వైపు ఆకర్షించింది. మరికొందరు వస్తారని చాలా రోజులుగా చెబుతున్నారు. ఈ నెల 23న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాల్లోను తన అభ్యర్థులను నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తే... అప్పుడు బీజేపీ అవసరం ఏర్పడుతుంది.

బీజేపీ మద్దతుతో మూడో అభ్యర్థి
అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోను ప్రజాప్రతినిధులను కొందరిని తమ వైపు లాక్కొని, బీజేపీ మద్దతుతో మూడో అభ్యర్థిని టీడీపీ గెలిపించుకునే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఎంత మేరకు టీడీపీకి అండగా నిలుస్తుందనేది ప్రశ్నార్థకమే.

బీజేపీకి మద్దతిచ్చే అవకాశాల్లేవు
అయినప్పటికీ, ఎన్డీయేలో కొనసాగుతున్నందున, హోదా లేదా ప్యాకేజీపై వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నందున బీజేపీ మద్దతిచ్చే అవకాశాలు పూర్తిగా కొట్టి పారేయలేం. అలాంటి పరిస్థితుల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకుంటే బీజేపీ అవసరం పడుతుంది. అందుకే అశోక్, సుజనలు కేంద్ర మంత్రి పదవుల నుంచి వైదొలిగినా ఎన్డీయే నుంచి బయటకు రాలేదంటున్నారు.

వైసీపీ అభ్యర్థి ఒకరు గెలుస్తారు
లెక్క ప్రకారం రాజ్యసభ ఎన్నికల్లో రెండు టీడీపీ, ఒకటి వైసీపీ గెలిచే పరిస్థితి ఉన్నందున వైసీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలంటే ఓ అభ్యర్థికి కావాల్సిన 44 ఓట్లు వైసీపీకి ఉన్నాయి. 23 మంది టీడీపీలో చేరినా వైసీపీ అభ్యర్థి గెలుస్తారు.

చంద్రబాబు పక్కా ప్లాన్
ఒకవేళ టీడీపీ మూడో అభ్యర్థిని నిలబెడితే, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారు, బీజేపీ సభ్యులతో కలిసి టీడీపీకి 43 మంది బలం అదనంగా ఉంటుంది. మరో అభ్యర్థి ఓటు వేస్తే వైసీపీ అభ్యర్థి ఓడిపోయి, టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. మూడో సీటులో పోటీ పోటీ వైసీపీ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ అవసరం పడుతుందనే ఎన్డీయే నుంచి బయటకు రాలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications