ఆ ఆందోళన సక్సెస్ చేసే బాధ్యత సజ్జలకే
Sajjala Ramakrishna Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాగన్ణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలచిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టిపెట్టింది వైఎస్ఆర్సీపీ.
దీనిపై ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు.

వెన్నుపోటు దినం ఆందోళనను విజయవంతం చేయడానికి అవసరమైన కార్యాచరణ గురించి సజ్జల మాట్లాడారు. వారికి దిశానిర్దేశం చేశారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో క్యాడర్ మొత్తం సమన్వయంతో పని చేస్తోందని అన్నారు.
ఈ ఆందోళన ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని, మండల స్ధాయిలో కూడా పోస్టర్ రిలీజ్ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మరింత విస్తృతంగా ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడైనా ఈ ఆందోళనను అడ్డుకుంటే దానికి తగిన విధంగా వ్యవహరిద్దామని, ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనలు తెలియజేయాలని సజ్జల సూచించారు.
ఎక్కడైనా అడ్డంకులు కల్పిస్తే న్యాయస్ధానాల ద్వారా వాటిని అధిగమిద్దామని, ముందుగా అనుకున్న విధంగా ర్యాలీలను నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాల అందజేయాలని పార్టీ నాయకులను కోరారు. దీన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే మీడియా ద్వారా వివరించాలని అన్నారు.
ఈ ఆందోళన విజయవంతమైతేనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా అర్ధమవుతుందని అన్నారు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించదలిచినది- ప్రభుత్వంతో ఘర్షణ పడడానికి కాదని, ప్రజల ఆవేదనను తెలియజేయడానికే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ కో-ఆర్డినేటర్లతో సమన్వయం చేస్తున్నామని, జిల్లా అధ్యక్షులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని వివరించారు. వారితో నిరంతరం టచ్ లో ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని పేర్కొన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి క్యాడర్ మొత్తం ఉత్సాహంతో ఎదురు చూస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications