పోలింగ్ సమయంలో టీడీపీ భారీ ప్లాన్?
Sajjala Ramakrishna Reddy: ఏపీలో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సరిగ్గా ఈ ఉదయం 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ ఆరంభం కానుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు.
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో పోలింగ్ సందర్భంగా హింసకు పాల్పడటానికి తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సమయంలో హింసకు పాల్పడటానికి టీడీపీ పెద్ద ఎత్తున కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు. టీడీపీ అభ్యర్థులు, ఏజెంట్ల ద్వారా హింసకు ప్లాన్ చేసిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఇప్పటికే తమ పార్టీ నాయకులకు సూచనలు ఇచ్చినట్లుగా తమ వద్ద సమాచారం ఉందని అన్నారు.
తమ పార్టీకి చెందిన నాయకులు, అభ్యర్థులు, ఏజెంట్లతో హింసకు పాల్పడి, వాటిని తమ అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించి, దాన్ని తమపై నెట్టివేయాలని వ్యూహం పన్నారని మండిపడ్డారు. ఫలితంగా ఓటర్లను ప్రభావితంచేయడానికి, పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పినట్లు వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నిస్తోన్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ ఇలాంటి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఈసీ, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు, ఏజెంట్లు పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా, హింసను ప్రేరేపించేలా వ్యవహరించినా తమ పార్టీ క్యాడర్ సంయమనంతో వ్యవహరించాలని కోరారు.












Click it and Unblock the Notifications