జనంలోనే జగన్: నియోజకవర్గాల్లో సభలు.. అక్కడే బస
YS Jagan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ బస్సు యాత్ర తొలి దశ షెడ్యూల్ వివరాలను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన ఉదయం కడప జిల్లాలోని ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాట్ బస్సు యాత్ర ప్రారంభమౌతుందని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధాకి నివాళి అర్పించిన అనంతరం జగన్ బస్సు యాత్రలో పాల్గొంటారని చెప్పారు. ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుని, అక్కడ రోడ్ షోలో పాల్గొంటారని అన్నారు. సాయంత్రం కమలాపురం మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారని, అక్కడే మేమంతా సిద్ధం తొలి బహిరంగ సభలో ప్రసంగిస్తారని సజ్జల వివరించారు.
వైఎస్ జగన్ బహిరంగ సభలు ఎలా ఉండబోతోన్నాయనేది ఇప్పటికే సిద్ధం ద్వారా చూశామని సజ్జల గుర్తు చేశారు. అంచనాకు మించిన స్థాయిలో ప్రజలు వస్తారని చెప్పారు. ఓ తిరునాళ్లలాగా సాగుతుందని, ఊర్లకు ఊర్లు తరలి వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అదే స్థాయిలో జగన్ బహిరంగ సభలు ఉండబోతోన్నాయని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతి రోజూ ఒక మహాసభను నిర్వహిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ప్రతి రోజూ ఉదయం స్థానికులు, వివిధ సంఘాలు, ప్రముఖులతో ఓ చర్చా వేదికను జగన్ నిర్వహిస్తారని సజ్జల పేర్కొన్నారు. తమ అయిదేళ్ల ప్రభుత్వంపై సూచనలు సలహాలను తీసుకుంటారని చెప్పారు. ఇక మీదట ప్రభుత్వం ఏర్పాటైతే ఎలా ఉండాలి? అనే విషయం ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని తెలిపారు.
మధ్యాహ్నం తరువాత పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గాల నాయకులను జగన్ కలుసుకుంటారని చెప్పారు. అప్పటి షెడ్యూల్‌ను బట్టి ఇందులో మార్పులు ఉండొచ్చని అన్నారు. అనంతరం సాయంత్రం వేళ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారని వివరించారు. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఉదయం ఒకటి, సాయంత్రం మరొక అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పర్యటించేలా షెడ్యూల్‌ను రూపొందిస్తోన్నామని అన్నారు.
28వ తేదీన నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో జగన్ ప్రజలను కలుసుకుంటారని, సాయంత్రం నంద్యాలలో బహిరంగ సభలో పాల్గొంటారని సజ్జల చెప్పారు. 29వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా పర్యటనలకు తాత్కాలికంగా విరామం ఉంటుందని, ఆ రోజంతా జగన్ నంద్యాలలోనే ఉంటారని అన్నారు. శనివారం అంటే 30వ తేదీన కర్నూలు లోక్‌సభ పరిధిలోని ఎమ్మిగనూరులో జగన్ బహిరంగ సభ ఉంటుందని వివరించారు.












Click it and Unblock the Notifications