జగన్ మాటల్లో కాదు చేతల్లో చూపుతారు - జరిగేదిదే : సజ్జల..!!
సీఎం జగన్ సామాజిక న్యాయం పాటిస్తున్నారని సజ్జల చెప్పారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం అమలవుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సామాజిక సాధికారతను ముఖ్యమంత్రి జగన్ చేతల్లో చూపుతున్నారని పేర్కొన్నారు. సామాజిక విప్లవ ఫలాలను రాష్ట్ర ప్రజలతో సహా దేశమంతా చూస్తోందని వివరించారు. నిజమైన సాధికారత దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే కాదు మహిళలు కూడా ముందుకెళ్తారని సజ్జల ధీమా వ్యక్తం చేసారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ సామాజిక న్యాయం పాటిస్తున్నారని సజ్జల చెప్పారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వగా, అందులోనూ 11 స్థానాలు బీసీలకు కేటాయించడం చరిత్రాత్మక అంశంగా పేర్కొన్నారు. ఇప్పటికే శాసనమండలిలో 4 నలుగురు మైనార్టీ ఎమ్మెల్సీలున్నారని చెప్పారు. ఇది కూడా రికార్డుగా పేర్కొన్నారు. ఈ ఎన్నికలన్నీ పూర్తయిన తరువాత మండలిలో 58 స్థానాల్లో 10 సీట్లు పట్టభద్రులు, టీచర్ల సీట్లను మినహాయిస్తే.. మిగిలిన 48లో తెలుగుదేశం పార్టీ 4కు పడిపోతుందని చెప్పారు. వైసీపీ బలం 44కు చేరుతుందని వివరించారు. వాటిలోనూ 30 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభ్యులు ఉండబోతున్నారని విశ్లేషించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక నిర్ణయంతోనే సాధ్యమైందన్నారు. జగన్ మాటల్లో కాదు చేతల్లో చూపుతారనేది ప్రపంచానికి తెలిసిందని సజ్జల వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి జగన్ తన మంత్రి వర్గం మొదలు కింది స్థాయి పదవుల వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. కేబినెట్‌లో 70 శాతం పదవులు, నగరపాలక సంస్థల మేయర్లు 90 శాతానికి పైగా, జెడ్పీలు 70 శాతం, ఎంపీపీ పదవులు 67 శాతం, మున్సిపల్ చైర్మన్లు 72 శాతం ఏదైనా సరే 50 శాతం పరిధిని కూడా మించి ఇచ్చారని వివరించారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ నాయకుడు, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళ, శాసనసభ స్పీకర్‌గా బీసీ నాయకుడు ఉన్నారని వివరించారు. సామాజిక న్యాయం సీఎం జగన్ తనకు, పార్టీకి నియమంగా పెట్టుకున్నారని చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ ఎందుకు సామాజిక న్యాయం చేయలేదని ప్రశ్నించారు. ఇవన్నీ భవిష్యత్తులో మరింతగా ముందుకెళ్తాయని స్పష్టం చేసారు. సామాజిక న్యాయాన్ని అందజేసే కృతనిశ్చయంతో జగన్ ఉన్నారని సజ్జల వెల్లడించారు.












Click it and Unblock the Notifications