తిరుమలలో అణువణువూ నిఘా పరిధిలో..
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 70,353 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,636 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.65 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆరు కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఈ ఏడాది సెప్టంబర్ 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ మధ్యాహ్నం నిర్వహించిన ఈ సన్నాహక సమావేశంలో విజిలెన్స్, ఫైర్, ఎస్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవ రోజుల్లో దేవదేవుడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు కల్పించాల్సిన భద్రత, ఇతర అంశాలపై చర్చించారు. భక్తులకు భద్రత కల్పించడంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఆరా తీశారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ముురళీకృష్ణ.. ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచుతూ టెక్నాలజీని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్ఫిస్తారని, ఈ కార్యక్రమానికి ఎటువంటి విఘాతం కలగుకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉండే పెద్దశేష వాహనం, గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం రోజుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని చెప్పారు.
బ్రహ్మోత్సవ రోజుల్లో వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ లు ఏర్పాటు చేయాలని సంబంధిత విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. దీనికోసం ముందుగానే పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలని, డిస్ ప్లే బోర్డులను అమర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications