తిరుమలలో సేవలు రద్దు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 67,127 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,910 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తొమ్మిది కంపార్ట్‌మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- ఈ నెల 9 నుండి 13వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు టీటీడీ అధికారులు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రతిరోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీమలయప్ప స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు.
ఇక శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు. దీనికోసం ఇంజినీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేశారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్పచుట్టూ జల్లులు పడేలా ఏర్పాట్లు చేశారు.
తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ వినియోగిస్తారు. అదేవిధంగా, నిఘా, భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరుపల్లి ఓడై తిరునాళ్, తెలుగులో 'తెప్ప తిరునాళ్లుగా పిలుస్తారు.
సాలకట్ల తెప్పోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 9, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవాలు ముగిసిన తరువాత వాటిని పునరుద్ధరిస్తారు.












Click it and Unblock the Notifications