భిక్షం కాదు, హోదా కావాలి, బాబుకు ఆ సత్తా ఉంది: తెలంగాణవాడినంటూ సంపూర్ణేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత, ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని సినీ హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత, ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని సినీ హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు గురువారం ఉదయం విశాఖ నగరానికి చేరుకున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి మేలు జరిగే హోదాను రాష్ట్ర యువత కోరుకుంటోందని, భిక్షంతో సమానమైన ప్రత్యేక ప్యాకేజీని వారు కోరుకోవడం లేదని చెప్పారు. యువత కోరింది వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని అన్నారు.
తాను తెలంగాణ వాడినయినప్పటికీ యువత హోదా పోరాటానికి మద్దతిచ్చేందుకు ఇక్కడికి వచ్చానని సంపూర్ణేష్ బాబు తెలిపారు. చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హోదా పోరాటానికి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు.

ఏపీకి హోదా కావాలని స్పష్టం చేశారు. విదేశాలు కూడా చెప్పుకునేలా ఏపీని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని సంపూర్ణేష్ బాబు అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో హోదా వస్తే రాష్ట్రానికి ఇంకా మేలు జరుగుతుందని అన్నారు. ప్రత్యేక హోదా పోరాటానికి సహకరించిన వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హోదా పోరాటం విజయవంతమైనట్లేనని సంపూర్ణేష్ బాబు చెప్పారు.
వచ్చాం అడ్డుకున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ
తాము యువత చేస్తున్న హోదా పోరాటానికి మద్దతు తెలిపేందుకు వచ్చామని.. అంతలోనే పోలీసులు అరెస్ట్ చేశారని ప్రముఖ సినీ దర్మకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. హోదా ఉద్యమం శాంతియుతంగా జరుగుతోందని చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజున వారి ఆకాంక్షను తెలియజేయడంలో తప్పులేదని అన్నారు.
యువత చేస్తున్న ఆందోళన న్యాయబద్దమైనదిన తమ్మారెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత డిమాండ్ ను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల హోదా ఆందోళన విజయవంతమైనట్లేనని తమ్మారెడ్డి చెప్పారు. తాను వస్తున్నట్లు ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపారు.












Click it and Unblock the Notifications