సిగ్గుపడ్డం లేదా?: ‘అశోక్ బాబాయ్’ అంటూనే.. సంచయిత తీవ్ర విమర్శలు, వైసీపీ ఎంపీ కూడా ఫైర్
విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుపై ఆయన సొంత అన్నయ్య కూతురు, మాన్సాస్ ట్రస్ట్ మాజీ ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీ అన్నయ్య పుట్టినరోజు నాడే మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపించారని.. ఇలాంటి చర్యలకు సిగ్గుపడటం లేదా?' అని ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.

అశోక్‌బాబాయ్ అంటూనే.. సంచయిత విమర్శలు
'అశోక్‌బాబాయ్ గారూ... మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. ఆయన రక్షణ కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడ్డం లేదా?' అంటూ ఘాటుగా విమర్శలు చేశారు సంచయిత గజపతిరాజు.
వారసత్వాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ సంజయిత ఫైర్
'సిబ్బందిని తప్పుదోవ పట్టించి,వారిని రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్ విద్యాసంస్థలను వాడు కోకండి . తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు మాన్సాస్ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు.ఆ వారసత్వాన్ని అశోక్ గజపతిరాజు గారు ధ్వంసం చేస్తున్నారు' అని సోషల్ మీడియా వేదికగా సంచయిత తీవ్ర విమర్శలు చేశారు. కాగా, విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని శనివారం మాన్సాస్ విద్యాసంస్థల సిబ్బంది చుట్టుముట్టి ఈవోను నిలదీసిన సంగతి తెలిసిందే. చెల్లించాల్సిన జీతాలపై హామీ ఇవ్వాలని వారు పట్టుబట్టారు. జీతాలు చెల్లించకుండా తాత్సారం చేయడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపైనే సంచయిత గజపతిరాజు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. ఓ వీడియోను కూడా జత చేశారు. అయితే, పలువురు ఉద్యోగులు సంచయితకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

మాన్సాస్ ట్రస్ట్ ముసుగులో అశోక్ అక్రమాలంటూ వైసీపీ ఎంపీ బెల్లాన
ఇది ఇలావుండగా, విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా అశోక్ గజపతిరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ముసుగులో ప్రభుత్వ భూములను అశోక్ గజపతిరాజు కుటుంబం సొంతం చేసుకుంటోందని ఆరోపించారు. ఇందులోని 200 ఎకరాల భూములను వైద్య కళాశాల కోసం ఇప్పటికే అమ్మేశారన్నారు. ఆ నిధులు ఏమయ్యాయో అశోక్ గజపతిరాజు చెప్పాలని డిమాండ్ చేశారు. సుమారు 3వేల ఎకరాల భూమిని అశోక్ కుటుంబం ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉందన్నారు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్. మాన్సాస్ ట్రస్టులో ప్రభుత్వ జోక్యం వలన అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబానికి తప్ప ప్రజలకు ఏమీ నష్టం లేదన్నారు.
Recommended Video

అశోక్ గజపతిరాజు.. ఆ ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనపర్చాలి..
తమ భూములను కాపాడుకునేందుకే మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భయంతో అప్పట్లో ట్రస్టులో అశోక్ ఆస్తున్నింటినీ విలీనం చేశారని ఆరోపణలు చేశారు. ట్రస్టుకు చెందినవి కేవలం 8851 ఎకరాలు మాత్రమేనని, రిజిస్టర్లు తారుమారు చేసి 14,450 ఎకరాలుగా చూపిస్తున్నారని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. మాన్సాస్ ట్రస్టులో వాస్తవానికి స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్, అడ్వొకేట్, డాక్టర్, వ్యాపారవేత్త సభ్యులుగా ఉండాలని అన్నారు. కానీ అశోక్ గజపతిరాజు హయాంలో ఈ నిబంధనలేవీ పాటించలేదన్నారు. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారన్నారు. తమ సొంత ఆస్తులపై అప్పట్లో ప్రభుత్వానికి అశోక్ గజపతిరాజు లెక్కలు చూపారని, అవికాకుండా ఏ ఆస్తులున్నా.. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి అప్పగించాల్సిందేనన్నారు.












Click it and Unblock the Notifications