తిరుపతి వెళ్లేవారికి ttd గుడ్ న్యూస్.. టోకెన్లు జారీ
తిరుమల శ్రీవారి భక్తులకు ఈనెల 12వ తేదీ నుంచి నిర్ధేశించిన సమయ వేళల్లో సర్వదర్శన టోకెన్లు సోమవారం ఉదయం ఆన్‌లైన్‌లో జారీ అయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను టీటీటీ జారీ చేసింది.
తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసంలో ఏ రోజుకారోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను జారీ చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం జారీచేస్తున్న టోకెన్లు పూర్తవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో ఈరోజే అందుబాటులోకి వచ్చాయి.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల కొండపై నిరంతరం అన్నదానం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అన్నప్రసాదం ట్రస్టుకు రూ.33 లక్షలు విరాళమిస్తే భక్తులకు ఒకరోజు భోజన సౌకర్యాన్ని కల్పిస్తామని అధికారులు తెలిపారు. అల్పాహారం కోసమైతే రూ.7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65లక్షలు, రాత్రి భోజనానికి రూ.12.65 లక్షలు అందించి భక్తులకు అన్నప్రసాదాలను దాతలే స్వయంగా వడ్డించవచ్చని తెలిపారు. విరాళం ఇచ్చే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత సెప్టెంబరులో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన 2023వ సంవత్సరానికి సంబంధించిన 12 పేజీల క్యాలెండర్లు అయిపోయాయి. ఈమేరకు తితిదే అధికారులు ప్రకటించారు. 13 లక్షల క్యాలెండర్లను ముద్రించి సెప్టెంబరు 27వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. వీటిని భక్తులు పూర్తిగా కొనుగోలు చేశారు. వీటికోసం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. జనవరి ఒకటోతేదీ నుంచి అందుబాటులో లేకుండాపోయాయి. భక్తుల డిమాండ్ దృష్ట్యా మరిన్ని క్యాలెండర్లు ముద్రించి ఉండాల్సిందనే అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications