రాహుల్ స్పీచ్ కోసం సర్వేVsదానం, విహెచ్‌కు చేదు
హైదరాబాద్: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించేందుకు మాజీ మంత్రి దానం నాగేందర్, కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణలు పోటీ పడ్డారు. శుక్రవారం రాహుల్ తెలంగాణలో పర్యటించారు. మొదట వరంగల్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అక్కడ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ అనువాదం చేశారు.
హైదరాబాదు సభలో రాహుల్ హిందీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించేందుకు దానం, సర్వేలు పోటీ పడ్డారు. ఈ సమయంలో సర్వేను రాహుల్ గాంధీ వారించారు. అనంతరం దానం నాగేందర్ యువరాజు ప్రసంగాన్ని అనువదించారు. అయితే, అది కొద్దిగా తప్పుల తడకగా సాగింది.

కాగా, చాంద్రాయణగుట్ట అసెంబ్లీ అభ్యర్థి సదానందం ముదిరాజ్ యువరాజుకు సభా వేదిక పైన పాదాభివందనం చేశారు. టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య నగర పార్టీ అభ్యర్థులను రాహుల్‌కు పరిచయం చేశారు. ఈ సమయంలో నాంపల్లి, కార్వాన్ అభ్యర్థులను పరిచయం చేయడం మర్చిపోయారు.
అంతకుముందు వి హనుమంత రావుకు చేదు అనుభవం ఎదురయింది. విహెచ్ గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. ఎల్బీ స్టేడియంలో రాహుల్ బహిరంగ సభ వేదిక వద్దకు విహెచ్ చేరుకున్నారు. వేదిక పైకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా... పోలీసులు వారించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీని అని చెప్పినప్పటికీ ఆయనను వేదిక పైకి అనుమతించలేదు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ఆయనను అనుమతించకపోవడంతో ఆగ్రహించి విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ వేదిక పైకి వెళ్లారు.












Click it and Unblock the Notifications