TTD పరకామణి చోరీ కేసు.. హైకోర్టులో కీలక పరిణామం..!!
Tirumala: తిరుమల పరకామణి చోరీ కేసు లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో హైకోర్టు ఆగ్రహంతో సీఐడీ రికార్డులను సీజ్ చేసింది. టీటీడీ కౌంటర్ దాఖలు చేయటం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఈవో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, ఇప్పుడు మాజీ ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో కీలక అంశాల ను ప్రస్తావించారు. చోరీ కేసు రాజీ చేసుకోవటానికి టీటీడీ... బోర్డు అనుమతి అవసరం లేదని చెప్పటం ఆసక్తి కరంగా మారుతోంది.
టీటీడీ పరకామణిలో చోటు చేసుకున్న చోరీ కేసు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సతీశ్ కుమార్ దాఖలు చేసిన కౌంటర్ లో టీటీడీ పరకామణి విభాగం ఇంఛార్జి అధికారిగా చోరీ కేసులో రాజీ చేసుకునే అధికారం లోక్ అదాలత్ చట్ట ప్రకారం తనకు ఉందని పేర్కొన్నారు. టీటీడీ చట్టం రాష్ట్ర శాసనమని, ఐపీసీ, సీఆర్‌పీసీ కేంద్ర చట్టాలని చెప్పుకొచ్చారు.

చోరీ వ్యవహారంపై నమోదు చేసిన సెక్షన్లు రాజీకి అవకాశం ఉన్నవేనని..ఈ కేసును రాజీ చేసుకోవడానికి టీటీడీ బోర్డు తీర్మానాలు అవసరం లేదని స్పష్టం చేసారు. చోరీ ఘటనపై ఫిర్యాదు చేసింది తానేనని, ఫిర్యాదుదారుడు రాజీ చేసుకోవడానికి ఎలాంటి నిషేధం ఉండదని కోర్టుకు వివరించారు. తాను సదుద్దేశంతో కేసు రాజీ చేసుకున్నాని చెప్పారు.
పరకామణిలో గుమస్తా సీవీ రవికుమార్ చోరీకి పాల్పడిన ఘటనపై నమోదు చేసిన కేసును లోక్ అదాలత్‌లో రాజీచేసుకోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు చేయించాలని టీటీడీ ఈవోకు ఇచ్చిన వినతిపై చర్యలు లేవంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ఏవీఎస్‌వో వై సతీష్‌కుమార్ తాజాగా హైకోర్టులో అఫిడవిట్ వేశారు.రవికుమార్ రూ.72వేల విలువ చేసే అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ సీసీ కెమేరాలకు బహిరంగంగా దొరికారని, వాటిని సీజ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది తానేనని ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ పేర్కొన్నారు.
సీవీ రవికుమార్ ఈ కేసును రాజీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుడిగా తాను రాజీకి ఒప్పుకున్నానని, ఇందులో సదుద్దేశం తప్ప ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. తన ఉన్నతాధికారుల సూచన మేరకు, టీటీడీ, భక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు కేసు రాజీకి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో, పిటిషనర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. సోమవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది.












Click it and Unblock the Notifications